పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

11


టయు, కాదంబరి, వావసదత్త మున్నగు గద్య కావ్యములందు రసస్పూర్తి గన్పట్టుటయు నందుకు నిదర్శనము, సంస్కృత లాక్షణికులు గద్యములుగూడ కావ్యముగఁ బేర్కొనిరి. పద్యకావ్యములను రచియించి సహృదయులను మెప్పించుట కన్న గద్యముల రచించి మెప్పించుట కష్టతరమను నభిప్రాయము ఆ కాలమున సలవాటులో నుండినటుల, వామనుఁ డుదాహరించిన “గద్యం కవీనాం నికషం వదన్తి” అను లోకోక్తివలన మన మూహింపవచ్చును.

కవిత్వమునకు వలయు వస్తుగుణ సామగ్రి యంతయు గద్యపద్యములకు సామాన్యమయ్యును ఛందము పద్యమునకు విశేషము. ఇట్లనుటవలన వాని రెంటికింగల భేదము ఛందస్సు నందేగాదు, దానిననుసరించు మఱికొన్ని గుణములయందుఁ గూడ. గాన లయా సమ్మేళనమువలనఁ గలుగు శ్రుతి మనోహరత్వమును భావప్రేరకశక్తియు ఛందమునందుఁ గలదు. ఛందస్సు కేవలము మానవ నిర్మితమగు కృత్రిమ శాస్త్రము గాదు. ఇందుకుఁ బ్రకృతియందె బీజములు గలవు. శోకరసా వేశుఁడైన వాల్మీకినోట అప్రయత్న పూర్వకముగ ఛందో బద్దమగు వాక్యము వెడలుట స్వభావ విరుద్దము గాదు. కవి హృదయము భావశబలితమై యుద్రిక్తమైనపుడు, భావములు తమంతఁ దాము ఉచితమయినభాష వెదకికొని లయాన్వితముగఁ బ్రవహించును. కోపభయాదులచేఁ జిత్తము చంచల మయినప్పుడు మనము మాటలాడ భాషకును, ఉచ్చారణకును, సామాన్య మనస్థితిలో నున్నపుడు మాటలాడు భాషకును జాల భేదము గనుపట్టుచుండును.