పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/165

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు కవితలో క్రొత్తతెన్నులు

ఈ వ్యాసము రెడ్డిగారి అసంపూర్ణ రచన. సాహిత్యాభిలాషులకు వుపకరించునను వుద్దేశ్యముతో ఈ సంపుటిలో చేర్చినాము. -సం.)

పూర్వకాలమున మానవ సంఘమునందు మార్పులు చాల ఆలస్యముగ జరుగుచుండినవి. దేశములకు అన్యోన్య సంబంధము పరిమితముగా నుండుటయే దీనికి కారణమై ఉండవచ్చును, సంఘమున కలుగు మార్పులు వాఙ్మయమున కూడ కలుగుట సహజము. ఈ కాలమున పరదేశ గ్రంథ బాహుళ్యమువల్లను వార్తాపత్రికల మూలమునను మార్పులు అనతికాలమున జరుగుచున్నవి. ఈ మార్పులు అనుకూలములా? ప్రతికూలములా? అనిగాని ఆవశ్యకములా? కావా! అనిగాని యోచించుటకుకూడ తడవులేదు. సుడిగాలిలో తగులుకొన్న యెండుటాకువలె మన సంఘము గింగిరీలు కొట్టుచున్న ది. పరదేశమున మ్రోగు ప్రతిధ్వనికిని ఇచ్చట ప్రతిధ్వనులు పుట్టుచున్నవి.

జీవవిలసనము ఉన్నప్పుడు కదలిక ఉండుట స్వాభావికము. ఈ కదలిక రెండు విధములు. సోపానములను ఎక్కు కదలిక యొకటి; దిగు కదలిక మఱొకటి. మన వాఙ్మయ ప్రపంచమున నేడు జరుగుచున్న మార్పులు ఏ కదలికకు సంబంధించినవా అని నిర్ణయించుట అంత తేలికగా కనిపించుట లేదు. అయితే, కాలము మాత్రము అన్నిటిని తూర్పార పట్టును. పొల్లుగింజలు చెత్తా చెదారము గాలికి