పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలంకార తత్త్వము

151


వింద పత్రములను కంటి ప్రక్కన వ్రేలాడ గట్టవలసిన యవసర ముండదు. చిత్రకారుడు రంగులు కలుపునట్లే కవి భావములను కలుపును; అట్టి భావసమ్మేళనము స్ఫురింపజేయుటకు ఉపమాద్యలంకారములను ఆశ్రయించును.

విరటుని గృహమునందు సైరంధ్రి వాలకముతో నున్న ద్రౌపదిపై కీచకుని మనసు లగ్న మైనది,

క|| నా యున్నబాము దలపవ
    యీ యొడలి చీర యిట్టి యేపపుజందం
    బోయన్న, మదన వికృతిం
    జేయుననుట యెంతయు నిషిద్ధముగాదె.

అని ఆమె యెంత వారించినను కీచకుడు వినడు. వినజాలడు, కామోద్రిక్తమానసుడైన కీచకునకు ప్రకృతిలోని రామణీయకమంతయు సైరంధ్రిగా మూ ర్తీభవించినట్లుకనుపట్టినది. ఈభావగాఢత్వము. తన్మూలమున గలిగిన రసతన్మయత్వము పస్ఫుటము చేయుటకు తగిన భాష కావలయును. కీచకుడు ఆమె యడుగులను చూచెను. సామాన్య భాషలో వానిని వర్ణింపవలయునన్న , అవి మెత్తగను, యెఱ్ఱగను ఉన్నవని చెప్పవచ్చును. అట్లు గాక ఒక వేళ వర్ణించువాడు సహృదయుడైన యెడల అవి “శిరీషకుసుమ పేశలములు' అని వర్ణించును. ఈ మాట లేవియు కీచకుని హృదయమును ఉఱ్ఱూతలూచుచున్న ప్రగాఢ భావోద్రేకమును శతాంశమైనను ప్రకటింప లేవు. కావున కీచకుడే తన భాషతో ఆమెను వర్ణింప వలయును: