పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/154

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

148

కవికోకిల గ్రంథావళి


మున ప్రవేశపెట్టుటకు ఉపమాద్యలంకారములు తోడ్పడును. కొంతసేపు తర్కించి విమర్శించి వివరించినగాని మనసునకు. పట్టని విషయములు సైతము అలంకార ద్వారమున సునాయాసముగ మనమున హత్తుకొనును.

“ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు
 చూడఁజూడ రుచుల జాడవేఱు;
 పురుషులందు బుణ్య పురుషులు వేఱయా.”

అరగంటసేపు ఉపన్యసించి వివరింపవలసిన విషయమును సాదృశ్యబలమున కవియొక వాక్యమున సాధించినాడు. భాషపొదుపునకు అలంకార మొక సాధనము.

భాషస్థూలము. భావములు సున్నితములు, ఏ భాష యందైనను పదజాలము పరిమితము. భావచ్ఛాయ లపరిమితములు. కావున పరిమితపదజాలముతో అపరిమిత భావములను ప్రకటింపవలసియున్న యెడల ఏవో కొన్ని సంకేతములు. సమయములు, శబ్దశక్తులు అక్కఱనుబట్టి సహజముగ ఉద్భవించును.

కవిత్వము భాషకు అలంకారము. కావ్యము భాషాలత పూచిన నెత్తావిపూలగుత్తి; భాషాపయోనిధి మథింపగా పైకి దేలిన అమృతకలశము. కావ్యమునందు భాషయు భావ ప్రకటనము ఉత్తమస్థితి నందియుండును. కావ్యమున కవికి లోకోత్తర భావచ్చాయలు ప్రకటింపవలసిన యవసరము కలదు. కాని పదజాలము పరిమితము. ఈ భాషాలోపమును పూరించుటకై కవిపడిన బాధకు ప్రతిఫలముగ ఉపమాలంకారము పుట్టినది.