పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/148

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

142

కవికోకిల గ్రంథావళి


జరిగియుండవచ్చునో, ఎట్లు జరిగియుండిన చిత్తాకర్షకముగ నుండునో దాని నూహించి కవి కావ్యమును వ్రాయును. చారిత్రక విషయము సైతము కవితాస్పర్శ చేత రూపాంతరము పొందును. ఇట్లు వారిరువురి మార్గములు భిన్నమైయుండగా కవి చరిత్రకారుఁడు కానందుకు మనమేల యాతనిని ఎత్తి పొడువవలయును?

మనము నాటకశాలకు పోవునది పురాణములు, చరిత్రములు నేర్చుకొనుటకు కాదు. రెండుమూడు గంటలకాలము నిరపాయకరమగు నానందము ననుభవించుటకు, చారిత్రక విషయములు తెలుసికొనవలయునన్న అందుకు తగిన గ్రంధములు గలవు. ప్రతాపరుద్రీయములోని కథ చారిత్రకము కానందువలన అది ప్రదర్శింపఁబడినప్పుడు సామాజికుల ఆనందమున కేమైన కొఱతయుండునా? పేరిగాఁడు, యుగంధరుఁడు చారిత్రిక పురుషులు కాకపోయినను వారిచేష్టలు, మాటలు మనకు సంతోషము గల్గించును. -

చౌదరిగారు ఢిల్లి యెక్కడ, గంగ యెక్కడ ? అని ప్రశ్నించినారు. నాటక ప్రపంచమును యథార్థ ప్రపంచ దృష్టితో చూడఁజనదు. నాటకము కొన్ని కవి సమయములకును కళానియమములకును లోఁబడియున్న అనన్య పరతంత్ర మైన సృష్టి, చిత్రకారుఁడు గోడపై తెలుపు, నలుపు రంగులతో లిఖించిన చిత్రము చదునుగా (Flat surface) నుండినను, వెలుఁగు నీడలవలన మిట్టపల్లములను స్ఫురింపఁ జేయును. నల్లగానుండు చోటు పల్లము, తెల్లగానుండుచోటు మిట్ట అను చిత్రసమయమును మన మంగీకరించి యున్నాము,