పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాటక కళా సంస్కరణము

105


గొంతులేని నటకులకు, పాటను సైతము మ్రింగివేయగల హార్మోనియము శ్రుతి మేలుచేసి పుణ్యము గట్టుకొనునట్లు, అభినయ చాతుర్యము కొఱతఁపడిన నటకులకు పాటలు అభయప్రధానము చేయుచున్నవి. ఇట్లనుటవలన నటకుఁడు బొంగురుగొంతువడి సంగీతజ్ఞాన శూన్యుఁడై యుండవలయునని నా సిద్ధాంతముకాదు. నాటకమున సంగీతము అభినయమునకుఁ గేవలము ఔపచారికముగ నుండవలయును; కార్యగతికి నేలాటి యభ్యంతరముఁ గల్పింపరాదు.

నేడు కొందఱు నటకులు పద్యములు చదువుటలో నొక యపూర్వపద్ధతిని గనిపెట్టినారు. ఒక పద్యమును రెండు మాఱులు చదువుట. సీసపద్యమైనయెడలఁ బ్రతిచరణమును రెండు రెండు మాఱులు చదువుట. మొదటి తూరి రాగముకొఱకుఁ జదువుట! రెండవతూరి అర్థముకొఱకుఁ జదువుట! తా నొక సభయెదుట నటించుచున్నాఁడనియు తానుజేయు అభినయము, తాను పలుకు మాటలు సభాస్తారులు గ్రహించిరో లేదో యను విచారము, తర్కము, నటకుని కెప్పటికి నుండగూడఁదు. అట్లుండినయెడలఁ దాను నటకుఁడు కాక , విద్యార్థులకు ఉక్తలేఖనము చెప్పు బడి పంతులవంటివాఁ డగును. రామకృష్ణమాచార్యుల నాటకములలో భూమికలు ధరించు నటకులందు పునరుక్తిదోషమొక గుణముగ వెలసినది. ఇందులకు మార్గదర్శకుఁడు కవియె. పద్యములోని భావమునే గద్యములోను పాటలోను గూడఁ జెప్పును. పాపము, ప్రేక్షకుల గ్రహణశక్తి ననుమానించి కాఁబోలు రెండుమూఁడు విధముల నయ భయముల