పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

కవికోకిల గ్రంథావళి

నాకు సంగీతముపై ద్వేషబుద్దికలదని నా మానవత్వమును సంశయింపబోకుఁడు. తగవుకానిచోట మంచిదియైనను చెడ్డదిగఁ దోఁచును. ఒకవేళఁ బౌరాణిక నాటకములలోని నాయికానాయకులు పాటలు పాడినప్పుడు అనిష్టముగనైన మన్నింపనచ్చును. పౌరాణిక నాయకులు అమానుష శక్తి సంపన్నులగుటవలన వారిజీవితము మనజీవితముకన్న భిన్నము గను, ఊహ్యముగను, గొన్నియెడల నలౌకికము గను గనుపట్టుచుండును. మానవసహజములగు సుఖదు:ఖములను వా రనుభవించునప్పుడే మనము వారితో నేకీభవింతుము. కాని, చారిత్రక సాంఘిక నాటక ములలోని నాయకు లట్లుగాదు. వారు మనుష్యులు, అమానుషశక్తి వారియొద్ద నించుకేనియు లేదు. కావున వాని సుఖదుఃఖములతో మనకు సమీప బాంధవ్యము గలదు. అందులో ముఖ్యముగ సాంఘిక నాటకముల నాయకుల ప్రవర్తనము ప్రస్తుతపు సాంఘికజీవితముయొక్క ఆదర్శక ప్రతిబింబముగ నుండును. అంగడివీధిలో గుడ్డల వ్యాపారము చేయుచుండ మనము ప్రతిదినమును జూచుచుండిన సుబ్బిశెట్టియు జిల్లా కోర్టులో మనము చూచుచున్న ప్లీడరు వెంకోజిరావుగారును మనము ప్రతిదినమును ఇంటిలో సంభాషించుచున్న తల్లి దండ్రులు, ఆలుబిడ్డలు స్నేహితులు మున్నగు వారు స్టేజిమీదకువచ్చి “తులువా పలువా” యనియు ““ ఛీఛీ, పోపో" యనియు ఫార్సీమెట్లకు అనువుగ విఱిగెడి అర్ధములేని పాటలతో సంవాదములు సలుపుకొనుచుండఁ జూచినప్పుడు వారిని బిచ్చివారి ఆసుపత్రికిఁ బంపింప బుద్ధి పుట్టునుగాని అందలి యానందము ననుభవింపఁజాలము.