పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

4

కవికోకిల గ్రంథావళి


మాత్రము తెలుపుచున్నది. రసార్ద్రమైన వాల్మీకిహృదయము క్రౌంచపక్షి శోకమునకు మఱింత యుద్రిక్తమై శ్లోకరూపమున బయలు వెడలెను. కవితాశక్తి అతని భావమునఁ బిక్క టిల్లుచు వెలికుఱుకుటకు సమయము వేచియుండెను. అట్టి సమయము క్రౌంచపక్షి యాక్రోశవేదనవలన సిద్ధించినది. అప్పుడు వాల్మీకి నోటినుండి యొక లయాన్వితమైన వాక్యము ఆకాంక్షితముగను, అప్రయత్నపూర్వకముగను బయలు వెడలెను. అది యపూర్వము. కావున వాల్మీకి యాశ్చర్యపరవశుఁడై దానినే తలపోయుచుండెను. అంతట బ్రహ్మ ప్రత్యక్షమై ఆయనుష్టుబ్ చ్ల్ఛోకములతో రామకథను రచింపుమని యాదేశించెను.

వేదములు ఛందోబద్దములు, ఛందస్సు వేదాంగములలో నొకటిగఁ బరిగణింపఁ బడుచున్నది. రామాయణము కన్నను వేదములును వేదాంగములును బూర్వము లనక తప్పదు. ఇట్లగుట వైదిక కవులేల ఆదికవులు కాకపోయిరి? దీనినిగుఱించి నేనిట్లూహించుచున్నాను. వేదమును విరాట్స్య రూపుని నిశ్వాసములనియుఁ గావుననే యవి యపౌరుషేయము లనియు ఆర్యులు విశ్వసించియుండినందున ఆ ఛందములు మానవు లనుకరింప సాధ్యములు గావని తలంచియుందురు. కొంతకాలమునకు వాల్మీకి యుద్భవించి, అంతకుమున్నె కథల మూలమునఁ బ్రజలయందు వ్యాపించియున్న రామాయణ గాధను కావ్యముగ రచియించెను. ఇట్లనుటవలన వేదముల కనంతరమును రామాయణమునకుఁబూర్వమును కవిత్వర చన లేదని చెప్పుటగాదు. నన్నయ భారతమునకుఁ బూర్వము తెలుఁగు దేశమున వ్యాపించియున్న గ్రామ్య సారస్వతము,