పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొండవీటి రాజ్యేందిర క్రుంకిపోయె
నకట! దురదృష్టవశమున, నైన నేమి?
నేఁడు సిరిగల ప్రతి రెడ్డివీడుకూడ
పండితుల పాలిటికి "పిల్లకొండవీడు.”

“జనకుని స్మృత్యర్థము నే
ననుకొంటిని నీదుకృతుల నచ్చొత్తింపన్
అనుమానమేల? నీవౌ
ననవోయి" యన్నతీరు “లౌ" ననిపించెన్.

నీ రసికత, నీ మైత్రియు,
నీరమ్యకళానుభూతి నిరతము శిల్ప
ప్రేరకమై నవకవితో
దారకమై పెంపు చెందుతున్ బ్రియమిత్రా!

నేను నీవును సకలంబు నిశ్చయముగఁ
గాలవాహిని నొకనాఁడు గలయఁగలము;
కాని, రమ్యమైన యపూర్వ కావ్యసృష్టి
అమరతం గూర్చుఁ గర్తకు నాశ్రితునకు!

సిరికిందగిన వదాన్యత,
పరువము, లలితాభిరుచుల బలిసిన భావ
స్ఫురణము, భోగప్రీతియు
విరిసెను నీబ్రతుకుఁ దీవ విరులటు మిత్రా..