పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/55

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కోయిల.

పైరుకోఁతలఁ గష్టించి పల్లెచెలులు
కొంత విశ్రాంతిఁ గొన్నారు, కోయిలా, ర
సార్ద్రకంఠంబు నెత్తి గానామృతంబుఁ
జల్లుమా వారిమనములు చల్లవడగ.

చిత్తరంజక రాగనిశ్రేణి వైచి
దివ్యగానంబు భూమికి దింపరావె !
తంత్రు లెడలిన నల్లకీదండ మటులఁ
గూజిత విహీనమై తోఁచు గున్నమావి.

నీవు లేకున్న గగనవనీ నికుంజ
తలములును బాడుపడినవిధానఁ దోఁచు!
నేడ కేఁగితో కోయిల యెమ్మెలాఁడి ?
పాడరావమ్మ, యొకమాఱు ప్రణయగీతి.

తేనెలూ రెడి నీపల్కు తీయ్యఁదనముఁ
గోరి విరహులపోలికఁ గుందువారు
కవివతంసులు; వాసంతకాల లాంఛ
సంబవయి రావె కోయిలా, సంజరముగ.