పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాల]

ఉపోద్ఘాతము

9


యథికారముద్రవలన ఆలక్షణమే కవులను నిగళబద్ధులను గావించినది.

కావ్యములలో నేయేవర్ణనము లుండ వలసినదియు నెట్టినాయికా నాయకు లుండవలసినదియు లాక్షణికులే తీర్మానించిరి. కాన కవిసృష్టికిఁ గొన్నిహద్దులేర్పడినవి. పూర్వకవులకు రాజులే యాశ్రయులు. రాజులు పండితులను సులోచనముల మూలమునఁ గావ్యపరీక్ష గావించుచుండిరి. ఇఁకఁ బండితులు రసార్ద్రచిత్తముతోఁ గాక శుష్కమైన లాక్షణిక మానదండముతోఁ గావ్యశిల్పమును గొలతవేయుచుండిరి. లాక్షణిక ప్రమాణమునకు వెంట్రుకపోనంత తగ్గినను ఆ కావ్యము గ్రాహ్యముగాదు. కావుననే యాంధ్రప్రబంధము లన్నియు నొకే యచ్చున గ్రుద్దినట్టు లొకేతీరున నున్నవి. ఒక కావ్యమును సొంతముగఁ జదివిన మఱియొక కావ్యమును జదువ నవసర ముండదు. అదేనాయిక; అదేనాయకుఁడు; అదే యుద్యానవనము; ఆదే మోహము; అదే విరహము; ఆదేశీతలోపచారము; అదే చెలికిత్తె; అదేసూర్యోదయము, అస్తమయము!

కాని, యిప్పటి కాలస్వభావము, పరిస్థితులు మాఱినవి. ముద్రణ యంత్రములు కాగితములు ప్రబలినవి. కావున గ్రంథములు సర్వజనసామాన్యమునకు సులభము లగుచున్నవి. ఇప్పుడు కవులను బోషించు వారు ప్రజలు. ప్రజల యభిరుచియు మాఱినది, ఇందుకుఁ జాల చారిత్రక కారణములు గలవు. పాశ్చాత్య సారస్వత సంబంధము వలనను, తన్నాగరకతా సంపర్కము వలనను ప్రజల భావములు ఆదర్శకములు మాఱఁజొచ్చినవి. సంఘమునందుఁ గొంత జీవచలనము ప్రారంభమయినది. ఈ నవీనపరిణామము కవుల హృదయములఁ బ్రతిఫలించి ఆంధ్రసారస్వతమునఁ జొచ్చినది. కావుననే నేఁడు హృదయమోహనమైన ఆధునిక సారస్వతము తఱితీపు తెలుఁగునందు బయలు దేఱినది.