పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

కవికోకిల గ్రంథావళి

[నక్షత్ర


శాస్త్ర కారుఁడును ఒకహృదయమును బరీక్షింపవలసిన యెడల కవి రసము, అనుభూతి, భావము మున్నగు వానికై వెదకుచుండును. శాస్త్రకారుఁడా హృదయమును గోసి అందెన్ని క్రోవులున్నవి, ఎన్నియరలున్నవి, నెత్తురే మార్గమున సంచరించునను విషయములను బరీక్షించుచుండును,

తెలుఁగు కవులలోఁ, గవిత్వము శిల్పమని ప్రథమమునఁ గనిపెట్టిన తత్త్వవేత్త మహాకవి తిక్కన. కావుననే యాకవి బ్రహ్మ “ కవిత్వ శిల్పమునం బారగుఁడన్" అని చెప్పుకొని యున్నాడు.

స్వాతంత్ర్యమునఁ గొంత సాహసముగలదు. సాహస మనునది మానవ ప్రకృతిని నవీన మార్గావలంబనమునకుఁ బురికొల్పును. మానవ సంఘము రాజకీయ సాంఘిక మత నైతిక దాస్యమునం బడి యాచారశృంఖలల మూలమున యంత్ర చలితమగు నొక ప్రతిభాశూన్య విగ్రహమువలె నున్నపుడు అట్టి సంఘముయొక్క, మనము నవీనకల్పనలకుఁ జొరఁ బాఱదు. ఆస్థితినిఁ గల్లోలించి భావదాస్య భారమున మ్రొగ్గుచున్న హృదయమునకు విశాల ప్రపంచ దృశ్యము కనఁ బడునట్లు విప్లవము జరుగనిదే మానవప్రకృతి నిర్ణిద్రముగాదు. కృష్ణదేవరాయల కాలమునందు నూత్న కావ్య సృష్టికింగూడ నీలాటి విప్లవమే కారణము.

ప్రపంచ చరిత్రమును బరిశోధించి చూచినయెడల, పూర్వులకు భవిష్యత్సంతతి వారినిఁ దమతమ అభిప్రాయాచార మూలమున బంధించు చాపల్యము అమితముగ నుండినట్లు దోఁచుచున్నది. ఇట్టి యధికార చాపల్యము అన్ని మానవజాతులలోను నున్నది. ఇది యసంగతమేగాక హాస్యాస్పదమును. ఇట్టి యారోపితాధికారము మతసాంఘిక రాజకీయ విషయములందే కాక కవిత్వమునంగూడ నాటుకొనియుండినది. కావ్యలక్షణము ప్రథమమునఁ గవుల రచనలనుండియే యుద్భవించిన దయ్యుఁ బ్రత్యేక లాక్షణికుల