పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము.

మానవహృదయమును దైనిక కలకలమునుండి తొలఁగించి' విషయభార విముక్తముచేసి, ప్రాపంచిక సీమాంతముల కవ్వల భావసృష్టి కల్పితమైన నక్షత్రమండలమున సంచరింపఁజేయుటకు శిల్పము సహాయకారి. శిల్పములలోఁ బ్రతిక్షణ భావనవ్యతకు నాలవాలమైనది కావ్యశిల్పము. ఇతరశిల్పములకును గావ్యశిల్పమునకును జాల వ్యత్యాసముగలదు. ఒకచిత్ర పటమును దర్శింత మనుకొనుఁడు. ఆ పటమునందు ఒక్క భావము, ఒక్క స్థితి, ఒక్క విధమైన రసానుభూతి యలవడును. కాని, కావ్యశిల్పమునం దిట్టినిశ్చలత యుండదు. అనుక్షణము భావములు పరిసరదృశ్యములు అనుభూతియు మెఱుఁగుతీఁగవలె మాఱుచుండును. కావ్యమును ఇప్పటి సినిమాకుఁ బోల్పవచ్చును.

కవులు సృష్టికర్తలు. వీరి ప్రధానకార్యము సృష్టి. ఇట్టిసృష్టివలనఁ బ్రయోజన మేమియని కొందఱు ముగ్ధహృదయులు, కొందఱు శుష్క రస హృదయులు ప్రశ్నింపవచ్చును. కావ్యసృష్టివలన సమూల్యమైన ప్రయోజనము గలదు. రమణీయకము పరిపూర్ణముగ వీకసింపని యీప్రపంచమునుండి సర్వతోముఖ రచణీయమైన కల్పనా ప్రపంచమున, గంగాతరంగ శీతలవాః కణ పూరితమును, నందనవన సద్యోవికసిత కుసుమ సౌరభ్య పులకితమునకు మందమారుత స్వాప్నికడోలికల రసార్ద్రమైన మానవహృదయమును గావ్యము ఉయ్యెల లూఁపుచుండును.