పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/253

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధి.

____


ధర్మసంస్థాపనార్థంబు దైవశక్తి
యుగయుగంబున జన్మించుచుండునన్న
యార్యసూ క్తికిఁ దార్కాణమైనయట్టు
లవతరించితె గాంధిమహాత్మ, నీవు ?

భీష్ముదీక్షయుఁ జైతన్యు ప్రేమరసము,
బుద్ధుని యహింస, ప్రహ్లాదు పూతభ క్తి,
యల హరిశ్చంద్రు సత్యవ్రతాఢ్యతయును
గలసి మూర్తీభవించితే కార్యశూర?

కురుభూమిన్ స్వవిపక్ష శోణితపు వాఁగుల్ పొర్లిపాఱన్ వసుం
ధరభారంబును డించి ధర్మనియతిన్ దక్కించె శ్రీకృఁష్ణుఁ; డి
త్తఱి నీవన్న నహింససూత్రమును సంస్థాపించి, వర్తించి, దు
ర్భర దౌర్జన్యపు మూలబంధము సడల్పంజాలితౌ దీనిధీ!

ముప్పదిమూడుకోట్లప్రజ ముక్తపథంబున నీ యనుజ్ఞలం
దప్పక యాచరింత్రు; మృతి దంష్ట్రలఁజిక్కగనైన జంకరో
యప్ప! చిరప్రసుప్త శిథిలాస్థి కళేబరమైన నీవు చేఁ
ద్రిప్పఁ బునఃప్రబుద్ధమయి తేజరిలున్ - మహిమేంద్రజాలతన్.