పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంచు కాలపుఁ బ్రొద్దు పొడుపు

_________

పిఱికివాఁ డొక సింహపంజరముఁ దెఱచు
నట్లు, కిటికీని దెఱచితి నల్లనల్లఁ;
జలికిఁ గప్పిన బూర్నీసు సడలనీక
తొంగిచూచితిఁ; గనుక్రొత్తదోఁచె నాకు!

ఆకసం బడ్డముగ వ్రాలె ననఁగ మంచు
దట్టముగ వ్రేలి సర్వంబుఁ దానె యయ్యె;
భావ దుర్బిణీ యంత్రంబుఁ బట్టిచూడఁ
బ్రళయకాల సూక్ష్మాకృతి ప్రతిఫలించె.

బాలభానుండు మంచులోపల వెలుంగఁ
గ్రమముగా బహుత్వము చుట్టుఁ గాన నయ్యె;
బాల్యమున విన్న “ దయ్యాల బైని” కథకుఁ
దగిన యస్ఫుటచిత్రమై తనరె జగతి !