పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/248

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

జాతీయత.

_______


ఓసి జాతీయతా, నీబలో జ్జ్వలత్వ
మెంత! నీశక్తి సామర్థ్యమెంత! నీదు
శంఖరవమునఁగల యింద్రజాల మెంత!
అస్థిపంజరములు సైత మాడు నౌర!

నీ యాజ్ఞచేఁగదా నిఖిల భారతభూమి
           గాంధీ మహాత్ముని కట్లఁ బడియె;
నీ కోర్కెచేఁగదా నెఱలోభి యైనను
           దాఁచి యుంచిన నిధుల్ త్రవ్వియిచ్చె;
నీ ధర్మమునఁగదా నెఱజాణయైనను
           మోటు ఖద్దరు మేన మోయఁ దొడఁగె;
నీ పిల్పుచేఁగదా నిర్ణిద్ర కీర్తులు
           చెఱసాలలం జిక్కి చీకువడిరి;

ఒక్క పెట్టున నీ భారతోర్వి నెల్ల
నూఁపి, కెరలించి, వేమాఱు ప్రోత్సహించి
త్యాగ సామ్రాజ్య పట్టభద్రతను గూర్చి
వడిగ స్వాతంత్య్ర రథమును నడిపె దరరె!