పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



పరిశిష్టము.

__________

పంటకారు - సాయంకాలము.

________

దినమెల్లన్ గృహ కార్యనిర్వహణ బంధీ భూత చిత్తుండనై
యినుఁడస్తాద్రి నలంకరింపఁగ విహారేచ్ఛల్ తలల్ సూపఁబా
వనమై పండినపైరు చేలనడుమన్ బంగారు స్వప్నాల కో
నను దేలాడినయట్లు పోయితి మహానందంబు చేకూఱఁగన్.

గూళులకువచ్చు పక్షుల కూజితములు
సంజకెంజాయ గారడి చక్కఁదనము
వరుల వినవచ్చు కీటకా వ్యక్తగీతి
కాఁపువానిని సైతము కవినొనర్చు !

ఆ పొలంబొక దేవాలయంబొ యనఁగ
హృదయము ప్రశాంతమై చింతలెల్లఁ బాసెఁ;
బ్రకృతి సౌందర్య గరిమ నన్ బందిసేయ
నోరులేని పూజారినై యూరకుంటి.