పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హృదయము

ప్రణయబలి

217

కాలన్ రాచి విదల్ప నేఁ బురుగునే, కాలానలజ్యోతి యం
చేలా నీ వెఱుఁగంగ లేవు? నిను నీసృష్టిం దుటారించి భా
వాలంబంబున దివ్యలోకములు రమ్యం బౌనటుల్ సల్పి నీ
యాలిన్ దొంగిలిపోయి మత్ప్రణయరాజ్యశ్రీ నొనర్తున్ విధీ!

తలఁపులయందె నావెతను దాఁచఁదొడంగితిఁ గాని, వాతసం
చలిత పయోధి వీచికల చాడ్పున రేఁగు విషాద మేఁచి, యా
కులమయి, గాఢసంయమనకూలముఁ ద్రెంపి క్రమించెనాలుకం;
దలఁగెను దానఁ గొంతపరితాపము; నర్ధవిముక్తి చేకుఱెన్ .

కరుణను నా కయాచితముగా నరిషించిన నీ వరంబులన్
మరలఁ బరిగ్రహింపుము రమాధవ, రమ్యకళావిభూతి, యం
బరచర భావలోలతయుఁ, బల్లవకోమలమౌ మనంబు దు
ర్భర రుజలౌచు నైహిక నివాస మసహ్య మొనర్చు నెంతయున్ .

గఱులను ద్రుంచి, నేలకును గాలికి బంధము వైచియుం, బయో
ధర రథచక్రముల్ పగులఁ దాఁచి, తటిల్లత జాటిఁ ద్రెంపి, క
ర్బుర రమణీయతా కిరణ రోధకమౌ కవచం బొసంగి, ప్ర
స్తర కఠినాత్ముఁ జేసి నను సంసరణార్హు నొనర్పు మీశ్వరా.

కవితానిర్ఝరి, క్రూరమౌ విధి తిరస్కారంబునన్ నీకు సం
భవమయ్యెన్ హృదయాంతక వ్యధలు కావ్యాలల్లిపాండగఁజా
లు విషా దాంకిత గీతికారవళి! చాలున్ నిల్పు మాక్రోశ గా
న విషజ్వాలలు! పూనుమీ యచల మౌనన్యాసదీక్షాధృతిన్.