పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనో విప్లవము.

_______

సృష్టి, చిత్రంబునకు మూలజీవమైన
జనన మరణ క్రమంబుఁ జింతన మొనర్చి
యంతుగనలేక యత్నంబునాఁపుకొంటి;
దేవ, పరమేశ, యున్నావొ? లేవొ? చెపుమ!

చాల ప్రసిద్ధ శిల్పివని చాటుచునుండును బండితాళి; నీ
లీల లనంతముల్; దెలియ లేము రహస్య; మదేలొకో నమూ
నాలను వ్రాసి వ్రాసి కరుణంబును దృప్తియులేక చింపె; దీ
కీలెఱుఁగంగ రాని కృతికిన్ లభియించున దేమి దెల్పుమా?

కొందఱు సృష్టి నీదయని కొందఱు కర్మఫలంబటంచు నెం
దెందఱొ వ్రాసినార లది యెట్లగు? కర్తవు నీవయేని నీ
చందము దూష్యమౌను; మఱి సర్వము కర్మఫలంబటన్న నీ
వెందు కజాగళ స్తనమ వీ యపదూఱు వహింప దైవమా?

తీవలునాటి, పాదులకుఁ దీయక నీరమువోసి, యామనిం
బూవులు పూవనున్న తఱి మూలములం దెకలించివైచు నీ
భావ మదేమి? యీముడిని బండితులైన సడల్పలేరు; కా
లావధి డగ్గఱించు! వృథ యయ్యెను జీవిత ముత్తచర్చలన్ .