పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హృదయము]

కవితాచితి

209

కడచెను మూడువర్షములు కాంతవియోగము సంభవించి;యా
పిడుగు కండిది తాఁకులకు బీటలు వ్రయ్యలు వాఱినట్టి నా
యెడఁదను బూర్వరూపమున నేరిచి కూరుచు మంత్రకత్తె యె
ప్పుడు పొడకట్టునో యమృతపూర్ణ కళోజ్జ్వల పాత్రహస్తయై,

రూపములేని సంస్మృతికి రూఢిగ సల్లుకొనంగలేక దా
దాపుగఁ బ్రేమవల్లి కృశతంగని దగ్గఱనున్న కొమ్మనే
ప్రాపుగఁ జేసికోఁ దలఁచి ప్రాకెడినౌర! గతానుభూతముల్
తీపులె యయ్యు మానవహృదిన్ సతతంబును బందిసేయునే?

భావము మాఱినంతనె ప్రపంచముమాఱును; బూర్వమట్లు సం
ధ్యా వివిధాభ్రవర్ణముల తట్టుకుఁ బోవదు బుద్ధి; కోకిలా
రావము లింపు నింపవు; నిరర్థక దాస్యములయ్యె యామినీ
సేవలు; రమ్యమౌ ప్రకృతి ఛీ! యనిపించు విరక్తి పెంపునన్..

ఇట్టి మంటల నింకెట్టు లించుకైన
నవురు వెన్నెల కవిత మనంగ నేర్చు?
నదియుఁ గాలానధింగాంచి యరిగెనేని
దాని చితిపైన నిర్మింతుఁ దాజమహలు!

మే 1927



_________