పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/230

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవితా చితి.

_______

నాలుక త్రుప్పుపట్టె; నొకనాఁడయినం జెవి కింపుగొల్పు కా
వ్యాలపనం బొనర్చు తల పంకుర మెత్తదు; వ్రాయఁబూనినం
దేలికకాలిగుఱ్ఱపు గతిన్ మఱపించెడు భావ మిప్పుడ
బ్బే! లివసచ్చి ముందడుగు పెట్టదు చాకలియెల్లి బేపినాన్.

రమణీయంబగు నాట్యరంగము నటీరాజ్యంబుగా మాఱి యం
దము నానందముఁ గూర్పఁ, బందిరి హఠాద్దగ్ధంబుగాఁ జూచి ని
ష్క్రమణద్వారముఁ గాంచలేక పొగలో గగ్గోలుగాఁ బర్వు పి
చ్చిమనుష్యుల్ గతి భావముల్ దిరుగు నాచిత్తంబునన్ మొత్తమై.
 
ఇదివఱ కెన్నఁడైన నుదయించిన యంతనె భావపంక్తులన్
బదుఁడని పంపుచుంటిని బ్రపంచపు సంతకు; నిప్పుడన్న నా
చిదగొద కాఱుచీఁకటులఁ జీఁకగు నాశ్రయ లుబ్ధభావముల్
మెదలవు నీరుటెండలఁ; దమిస్రమె స్వర్గము భుక్తిసారతన్.
 
కలమును కాగితంబు తనఖాపడె! 'గుడ్బయి!' రామిరెడ్డి, నీ
పలుకులు వీనులార విని వత్సరముల్ సనె; నంత చెల్లె! చి
ట్టెలుక విధాన దాఁగికొని యేమొనరించెదవోయి యంచునన్
బలుమఱు హెచ్చరించు హితవర్యుల కేమని విన్నవించెదన్.