పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

కవికోకిల గ్రంథావళి

[భగ్న


హృదయపు వల్లకాటి రసహీనత దేహమునందె గాక నా
మృదుల కవిత్వపున్ లతల మీఁదికి సైతము నల్లునంచు నా
కొదవెడి సంశయంబు; కృతియున్ సతియట్టుల జంటవాసినన్
బ్రదిమికి నువ్వునీళ్ళనుచుఁ బాద పరాగము రాల్చిపోయెదన్.

విరహపు దుమ్ములోఁ బొరలి వెఱ్ఱిదనాల బికారినై వ్యధా
భర కబళంబులన్ హృదయపాత్ర భుజించుచు బ్రేమవాకిటన్
జిరముగ వేచి యీ కఠిన జీవితమున్ గడుపంగనేల? యం
బరచర కామినీ ప్రణయ మందిరముల్ కఱవాయె నేమొకో!

ఆసవ మింకి క్రొన్నురుఁగు లారిన కొంచెపు మట్టిపాత్రలో
నాసలు నింపి, క్రొత్తఁదన మంటుకొనం బునరుద్ధరించు నా
యాస మదేల నీకు; బ్రభువా? యిఁక నన్నొక భగ్న పాత్రలన్
వేసెడి మూలలో విసరివేయుము భుక్తము సంస్మరింపఁగన్.

24-9-1926.



__________