పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

కవికోకిల గ్రంథావళి

[భగ్న

ఇపుడన్నన్ విధి వేఁటకాని వలలో నేకాకినై చిక్కి, పూ
ర్వపుటుత్సాహముగోలుపోయి, గఱులున్ భగ్నంబులైచిందఁగం
గృపతో వీడిన, నీడ సంస్థితుఁడనై "రేయుంబవల్ చీఁకటిన్
అపనోదించు తలంపుతో బ్రదుకు నాయాధిక్య మింకేటికిన్ ?

చిత్తతాపంబుఁ బాపుకోఁ జేలగట్ల
కరిగి కూర్చుండ, మూక సహానుభూతిఁ
బైరు తలవంచు భారంబుఁ బంచికొన్న
ప్రాణసఖులట్లు, కవులకు బ్రకృతితోడు!

అపర దిక్కాంత సైతము నస్తమించు
నరుణ బింబంబుతోఁ గన్ను లవియఁ జేయుఁ ,
దనదు పూజారి యిక్కట్లు తలఁచి కుంద
నెఱ్ఱ ఫుండాయెనో యేమొ హృదయమనఁగ.

ఈ యిలకున్ ననుం బెనచు నే గుదిబందములేదు; ప్రేమ యా
దాయము సన్నగిల్లె; నది దాఁటుట కింకఁ దయారు; రేవునం
బాయక వేచి యుందు నుడుపంబులు నచ్చెడిదారిఁ జూచుచుం
జేయునదేమి? యా పడవ శీఘ్రమువచ్చునొ! యాలసించునో!

మునుపటిరీతిఁ బ్రత్యుషము మోహనవేషము దాల్చి శయ్యపై
గనుగవమోడ్చియున్నననుగాంచి 'సఖా'యని మేలుకొల్పు,మో
మునఁ దన మోము నాన్చి సుఖముం జిలికించెడి ముద్దువెట్టు; నై
నను బరిదగ్ధసారము మనంబు ముదం బెటు లాశ్రయించెడిన్?