పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/225

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిస్మృతి కణము .

________

కనులు మూసినఁ దెఱచినఁ గానుపింతు
వింట నడయాడినట్టులె యిందువదన!
సంతత ధ్యానలీనమౌ స్వాంతమునకు
వెలుఁగు జీఁకట్ల భేదంబు దొలఁగునేమొ!
తెల్లవాఱినఁ బూదండఁ దీసివైవఁ
దరుణి వేణిక నిలుచు నెత్తావి పోల్కి,
మర్త్యమౌ నీస్వరూపము మాటువడియు
సార వర్ణాంకిత స్మృతి సమసిపోదు
చావు బ్రతుకులమధ్య విశాలమైన
కలలవంతెన గట్టితి తలిరుఁబోణి,
కార్యలంపట దినమునకన్నఁ బ్రకృతి
ముసుఁగుఁ దీసెడి రాత్రి నాకొసఁగుఁ బ్రియము.
పవలు రేయికిఁగల భేదబాంధవములె,
యిహపరంబులయందు నూహింపఁగలము;
రెంటి కూడలియగు సంజ, మింటికొనల
విమలరాగంబు వెదజల్లు, వెఱపునిడదు.

మే 1926.