పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిసంశయావస్థ.

__________

కవితా, వింతయొనర్చె నీదగు నుపేక్షాభావముం జూడ, హే
తువు లేవేనియు లేక నాపయి నసంతుష్టిం బ్రదర్శించి క
న్గవకుం గన్పడనైనఁ గన్పడవు; సఖ్యం బిట్లు మూన్నాళ్ళ భా
గవతంబయ్యెనె? తెచ్చికోలలకవేడ్కల్ మీకు సామాన్యముల్

వలపుఁ బరీక్షసేయ నిటువంటి విరాగముఁబూనినావొ? నీ
చెలిమియె సన్నగిల్లెనొ? విశేషత నాయెడ నంతరించెనో?
పిలువని పేరంటంబునకు వేమఱుఁబోఁ గడుఁ జుల్కనంచు నో
చెలియ, బిగింపుఁజూపెదవు? చెల్లెను వత్సర మింతమట్టుకున్.

నిమిషములోన నీ మొగము నీడగఁ గన్నులఁగట్టి 'యేది?' యం
చమితపు టాస నే దెసలనారయ, మాయలమారివౌచు వే
గమె కనుచూపు దాఁటెదవు! క్రౌర్యము నీకు వినోదమేని నా
కమలిన సున్నితంపుటెదఁ గమ్మగ విందొనరింపు మంగనా.

వరిచేలం గడసంజలందుఁ దిరుగన్ వాంఛితునేగాని, నా
సరసన్ నీవును లేమి, మున్నటుల నచ్చంబైన యానందముం
బొరయంజాలకపోతి, జీవితమె దుర్బోగ్యంబుగాఁ దోఁచె; బం
గరు స్వప్నంబు తటాలునన్ మఱిఁగె; ఱెక్కల్ భారమైక్రుంగెడిన్