పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానాకాలపు పల్లీజీవితము.

శ్రావణనీలమేఘముల చల్లనినీడలఁ బెంపు నొంది, క్రొం
దావుల: జల్లుచుం బొలముదాపునఁ బూచెను గేతకంబు; లే
తావులనైన యౌవనముఁ దాల్చె వసుంధర పైరుపచ్చలన్ ;
ఆవులు కండపెట్టెఁ దనివారఁగఁ బచ్చిక మేసి బీరులన్ .

కాఱుమెయిళ్ళపైన హరికార్ముక రేఖలు స్వర్గపట్టణ
ద్వారపుఁ దోరణంబు సరిదాఁక, బలాకలు మాలగట్టి యా
దారినె సంచరింప, నిశితత్వముఁ బాసిన సూర్యరశ్మి లేఁ
బైరుల సేవఁజేయఁ గనుపండువుఁ గొల్చు దినంబు లియ్యెడన్.

ప్రకృతి లీలావిలాస కావ్యంబునందు
రసవదధ్యాయమేమొ వర్షంపు ఋతువు!
కానిచోఁ దదధ్యేతలౌ కర్షకులకు
నెటులఁ బరనిర్వృతిం గూర్చి యింపెలర్చు ?

పనిపాటుల్ ముగిసెం గదా,యిఁకను లేఁబ్రాయంపు టిల్లాలితో
దనపైఁ బ్రక్కలఁ ద్రొక్కిమూఁగు పసిసంతానంబుతో వర్షపున్
దినముల్ తిన్నగఁ బుచ్చవచ్చునను నుద్దేశమ్మునం గాఁపు గ
న్గొనుచుండుం దన పైరుచేల శ్రమకున్ జోడైన సంతృప్తితోఁ .