పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/202

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ద్యము]

అనార్కాలి

179

ఏ భావనస్పర్శ, మే రసావేశ,
మీ యపూర్వపు రాగ మీమూర్చనంబు
రేఁపెనోగాని నీ హృదయ విపంచి
నానంద మదిరాబ్ధి యపర పారమునఁ 20
గనక సైకతమునఁ గాలు మెట్టెదవు;
గాలిలోఁ దేలిన లీల భూతలము
నడుగు లంటీ యంట కమర నాట్యంబు
నొనరింతు వరరె! నీవూర్చెడు నపుడు
పైకిఁ గ్రిందికిఁ బోవు పాలిండ్లతోడ
సభ్యుల భావంబు స్వర్గమర్త్యముల
నడుమఁ ద్రిమ్మరుచుండు నాడె విధాన;
మంజీర కింకిణీ మధుర రావముల
జంగమ వీణలై చరణముల్ మ్రోసె;
అను నిమేష నవంబులై యంగ భంగు 30
లలరెఁ గన్నులపండువౌచు నాట్యమున;
సంభ్రమించె మనంబు, చక్కందనాల
పడుచుదానా, నీవు ప్రణయనాట్యంబుఁ
జాలింపుమింక ! నాస్వర్గమునఁ దక్క
నింత సంతసమున కిలఁ దావులేదు;
చావైనఁ దీపె యీసమయంబునందు!