పుట:Kavijeevithamulu.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
78
కవి జీవితములు

ఆంద్రభారతము.

సోమయాజికృతము లగుప్రసిద్ధగ్రంథములు రెంటిలోపలను భారతగ్రంథమువలన నాతనికవిత్వమహత్త్వము జగద్విదితమైనది. కావున మనము ముందుగ భారతరచనకుం గలకారణములం జెప్పి అనంతరము నిర్వచనోత్తర రామాయణగ్రంథరచనావృత్తాంతమును వివరింతము భారత మాంధ్రీకరించుటలో సోమయాజి యుద్దేశ మితరులవలన నెట్లు గా వాడుకొనంబడినను దాని నంతయు విరాటపర్వారంభంబున నాతని చేతనే వివరింపబడి యున్నది. దాని నీక్రింద వివరించెదము :-

ఉ. శ్రీ యన గౌరి నఁ బరఁగుచెల్వకుఁ జిత్తము పల్లవింప భ
    ద్రాయితమూర్తి యై హరిహరం బగురూపముఁ దాల్చి విష్ణురూ
    పాయ నమశ్శివాయ యని పల్కెడుభక్తజనంబువైదిక
    ధ్యాయిత కిచ్చ మెచ్చుపరతత్త్వముఁ గొల్పెద నిష్టసిద్ధికిన్.

వ. అని సకలబ్రహ్మప్రార్థనంబుఁ జేసి తత్ప్రసాదాసాదితకవిత్వతత్త్వనిరతిశయానురూపానందభరితాఁతఃకరణుండ నగుచుండి యొక్క నాఁ డిట్లు వితర్కించితి.

శా. విద్వత్సం స్తవనీయభవ్యకవితావేశుండు విజ్ఞానసం
   పద్విఖ్యాతుఁడు సంయమిప్రకరసంభావ్యానుభావుండుఁ గృ
   ష్ణద్వైపాయనుఁ డర్థి లోకహితనిష్ఠం బూని కావించె థ
   ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగులేఖ్యం బైనయామ్నా యమున్.

క. వేదములకు నఖిలస్మృతి, వాదములకు బహుపురాణ వర్గంబులకున్
   వా దైనచోటులను దా, మూదల ధర్మార్థకామమోక్షస్థితికిన్.

          వ. అదియును.

ఉ. ఆదరణీయసారవివిధార్థగతిస్ఫురణంబు గల్గి య
   ష్టాదశపర్వనిర్వహణసంభృత మై పెను పొంది యుండ నం
   దాదిదొడంగి మూఁడుకృతు లాంధ్రకవిత్వవిశారదుండు వి
   ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్.

మ. హృదయాహ్లాది చతుర్థ మార్జితకథోపేతంబు నానారసా
    భ్యుదయోల్లాసి విరాటపర్వ మట నుద్యోగాదులుంగూడఁ గాఁ
    బదు నేనింటిఁ దెనుంగుబాస జనసంప్రార్థ్యంబు లై పెంపునన్
    దుది ముట్టంగ రచించు టొప్పు బుద్ధసంతోషంబు నిండారఁగన్.