పుట:Kavijeevithamulu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయభట్టు.

59



దుర్జనునకును గల్గుభేదంబు. ఈతఁడు సహజముగ సన్మార్గవర్తనుండవుటం జేసి ధనంబునకుఁగా దా నొనర్చినచెట్టలఁ దలంచి పశ్చాత్తప్తుం డయ్యెను. ఇట్లు తాఁ జేసినచేఁతనే మరలఁ జింతింపుచు నన్నపానంబులఁ గొనక పరులకు మొగంబు సూప నోడి వగఁ గుందు చున్న నన్న పార్యు తెఱం గెఱింగి రా జాతనిం జూడ నేతెంచి యో దార్చి గడచినదానికి వగచిన నేమగు నని తెల్పిన నాతఁడు మిగుల జాలినొందె. అపు డాతనితో రాజేంద్రుండు మరల భారతంబు దెనిఁగించి యొకవ్యాసంగంబున నుండుటచేత వంత కొంత మాను ననుడు నాతఁ డిట్లనియె. కటా! పంచమహాపాతకప్రధాన బ్రహ్మహత్యకారి నగు నాకుఁ బంచమవేదం బగుభారతంబు ముట్టుటకైన నర్హత లేదు. వికలం బగునామనం బట్టిమహ త్తరకార్యనిర్వహణంబునకుం జాలదు. అని కన్నీరు మున్నీరుగా నేడ్చుచున్న నన్నపార్యుం గాంచి గత్యంతరం బేమనిన రాజున కాతఁ డిట్లనియె.

రాజు కవులను వెదకించుట.

ఉపాయాంతరంబు సెప్పెద వినుండు. మత్కృతభారతసభాపర్వంబులోని దగు :-

మ. మదమాతంగ తురంగ కాంచనలసన్మాణిక్య గాణిక్యసం
    పద లోలిం గొని తెచ్చి యిచ్చి ముద మొప్పం గాంచి సేవించి రా
    యుదయాస్తాచలసేతుశీతనగమధ్యోర్వీపతు ల్సంతతా
    భ్యుదయుం ధర్మజుఁ దత్సభాస్థితు బగత్పూర్ణప్రతాపోదయున్.

అనుపద్యము పత్త్రికల లిఖించి దీనిఁ దేశములకుఁ బంపుఁడు. ఈపద్యమునకు సమాన మగుపద్యం బెవ్వఁడు వ్రాయునో యాతఁ డీభారతంబును దెనిఁగింప సమర్థుండు. అట్టివాని నారయ భటులను బంపుఁ డనుడు నాపద్యంబు బహుపత్త్రికల లిఖించి దానికిఁ దుల్యం బగుదానిని వ్రాయఁ గవులకుఁ బ్రార్థనాపత్త్రికలు వ్రాసి వానిని దేశ దేశంబులకుఁ బనిచిరి.