పుట:Kavijeevithamulu.pdf/661

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెన్నెలకంటి సూరనార్యుఁడు.

655

నాపద్యమంతయుఁ బూర్తిచేసిన దత్తప్పకవిం జూచి యాచమనీఁడు దిగ్గన లేచి యుయ్యలపైనే కూర్చుండి కవిం బరీక్షించుప్రభుఁ డిచటనే యున్నాఁడు. పరీక్షించిన నిల్చుకవి యుండఁగలఁడో యను సంశయము తీఱినంగాని ప్రభుఁడు మెచ్చఁ డని పల్కి యాచమనీఁడు తనకడ నున్నసమస్యల నొక్కొకదానినే దత్తప్పకవికి నీయఁ బ్రారంభించె. వా నిన్వెంట వెంటనే దత్తప్పకవి పూర్తిచేయుచు వచ్చె. (తెలుఁగు సమస్యల పుస్తకములోని పెక్కుసమస్య లీదత్తప్పకవిపూరణములే యని వాడుకొనంబడు.) అట్టి దత్తప్పకవిసమయస్ఫురణమునకు నాశుధారకు నచ్చెరువందుచు యాచభూమీశుఁడు దుష్కరప్రాసయుక్తము లగుసమస్యల నీయందొడంగె. వానింగూడఁ బూర్తిసేయుదత్తప్పకవిం జూచి యాచమనీఁడు తనకు భంగపాటు కల్గు నను భయంబునఁ దనకడ బ్రహ్మాస్త్ర సమముగానిల్పియుంచిన

'గుండ్రాతికిఁగాళ్లు వచ్చి గున గున నడిచెన్‌'

అను సమస్యనిచ్చె. అక్కడి కాతనిసమస్యాసామగ్రి ముగిసె నని దత్తప్ప యూహించి యిఁక నాతని వెఱపింపసమయ మని దాని నీక్రింది విధంబునఁ బూర్తిచేసె. ఎట్లన్నరు -

"క. ఉండ్రా యోరికులాధమ (దురాత్మక, యిండ్రాప్రాసంబు కవుల కియ్యందగునా
     అండ్రాముకరుణచేతను, గుండ్రాతికిఁ గాళ్లు వచ్చి గున గున నడిచెన్."

అని యిట్లు చెప్పిన విని యాచభూవరుఁ డుయ్యల డిగ్గనుఱికి దత్తప్పకు నమస్కరించి కూర్చుండుటకు సెలవొసంగినఁ జూచి దాని నంగీకరింపక కోపోటోపంబున దత్తప్ప "తిట్టుదునా" అని యొకపద్యమారంభించునట్లుగాఁ బలికె. దాని విని యాచభూపాలుఁడు వలదు వల దని దత్తప్పకవిచేతులు పట్టుకొని బ్రాహ్మణుఁ డలుగఁదగునే సైరింప వలయును. అని యాతని వేడుకొని కూర్చుండఁ బెట్టి చీనిచీనాంబరములు తెప్పించి యాతనిపయిఁ గప్పె. అట్టివానిలో నొకదానింబట్టి అతనియెదుటనే దత్తప్ప ముక్కలుముక్కలుగాఁ జింప నారంభించె. దానిం జూచి యేమి స్వామీ యిటులొనరించుట న్యాయమా ? యని యడుగుయాచమనీనిం జూచి దత్తప్ప యిట్లనియె.