పుట:Kavijeevithamulu.pdf/630

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

624

కవి జీవితములు.

అని యున్నది. దీనింబట్టియే భాగవత మాంధ్రీకరించిన పిమ్మటఁ బోతనామాత్యునివలన నీ వీరభద్రవిజయము రచియింపఁబడినట్లు వాడుక గలిగెను. అయితే మొదట నుదాహరింపఁబడిన పద్యమువలన వీరభద్రవిజయము రచియించునాఁటికి దద్గ్రంథకర్త యగుపోతయకవి పిన్న వాఁడనియు పెక్కుసత్కృతులను విననివాఁడనియుఁ జెప్పంబడియున్నది. కావున భాగవతగ్రంథ మావఱకే యీపోతన రచియించె నని చెప్పినమాట నిలువనేరదు. ఇఁక భాగవత ప్రబంధ మనునొకగ్రంథ మాతఁ డావఱకు రచియించియుంటి నని చెప్పిన దాని కర్థము బమ్మెరపోతనామాత్య కృతభాగవతపురాణాంధ్రగ్రంథము కాక ప్రత్యేకము భాగవత మనునొకప్రబంధము రచియించియుండె ననియు నందులో దక్షయాగకథాసందర్భములో నీశ్వరుని నిందించినట్లును అర్థము చెప్పినచో దోషము లేదు. బమ్మెరపోతరాజు భాగవతము తనబాల్యకాలములోపలనే రచియించినట్లు చెప్పియుండలేదు. ఇంతియకాక ఆగ్రంథముయొక్కవిశేష కథాంశములం బట్టియును, పద్యబాహుళ్యముం బట్టియు నిది పదియిరువదిసంవత్సరముల కాలములోఁగాక త్వరలో ముగించఁదగినగ్రంథము కాదనియు భాగవతగ్రంథము నాంధ్రీకరింపఁ దొడంగునాఁటికే పోతనామాత్యుఁ డద్వైతశాస్త్ర సంబంధము లగుననేకగ్రంథములను, భాష్యముల నధ్యయనము చేసియుండవలసి యుండుననియు నది పది యిరువది సంవత్సరముల కాలమునంగాని సమకూడునది కా దనియు నూహింపవలసి యుండును. పోతన బాల్యమునుండి యనఁగాఁ బదిసంవత్సరములనుండి వేదాంత శాస్త్రాభ్యాసము చేసి యుండినను ముప్పదవ యేటం గాని భాగవతముఁ దెనిఁగింపఁ గడఁగుటకు సమర్థుఁడై యుండఁడు. అట్లుగా యత్నించి దానిం దెనిఁగింప నారంభించినను నేఁబదియవవత్సరము నాఁటికిగాని దాని ముగియించియుండఁడు. అటు పిమ్మట వీరభద్రవిజయగ్రంథరచన యై యుండును, ఇట్లుండఁగా నా నాఁటికి నీపోతనామాత్యుఁడు పిన్నవయసుననున్నాఁడనియుఁ బెక్కు