పుట:Kavijeevithamulu.pdf/620

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

614

కవి జీవితములు.

సూత్రమును దా సమర్థింపలేక తాను పైనఁ జెప్పినపద్యార్థమునకుఁ బాత్రుఁ డయ్యె నని యొరు లాక్షేపింప మన మే మని సమర్థింపఁ గలము ? అట్లు సమర్థింపలేనిచో నీతనిగ్రంథంబును సలక్షణంబుగాదన వలసివచ్చును. దీనిని రేఫమైత్త్రికి సమ్మతించనివా రేమని సమర్థింతురో ! ఆముక్తమాల్యదలోని కొన్నిగురువులై లఘువులుగాఁ గాన్పించు రేఫములకు వీరు ద్విరూపము లున్న వన్నట్లు వీనికిని ద్విరూపముల నైనఁ జెప్పవలెను. లేకున్న నింకొక విశేషవిధాన మేమైనఁ గల్పింపవలయును. సర్వజనులకుఁ బ్రామాణికగ్రంథం బగుభారతంబున గాన్పించు ప్రయోగములంబట్టి సూత్రములను సవరించిన నేమికొఱంత ? భారతమునందుఁ బ్రయోగము లున్న వని వీరికిఁ దెలియక యుండునా ? అ ట్లుండుటకుఁ గారణముమాత్రము కానరాదు. ఇట్టిప్రయోగంబులు భారతంబునం గలవా యనవలదు. వానిం గొన్నిటిని వివరింతము -

1. "క. సర్పముఖశరము గల దని, దర్పంబునఁ గ్రీడిఁ దొడరఁ దలఁపకు హరి పెం
         పేర్పడఁగ నదియ కా దట, తీర్పవలయువానినెల్లఁ దీర్చు నరునకై."

ఇందులో 'తీఱు' శకటరేఫము గలది. ఇచ్చట నీ గురురేఫమునకును మిగిలిన లఘురేఫములకు మైత్త్రి చెప్పంబడియె. దీనికి రేఫాక్షరమైత్త్రి సమ్మతింపనివారిచే గొన్ని విశేషవిధానంబులు గల్పింపంబడియె. అం దొక దాని నిట వివరింతము. "రేఫమునకు నన్యవర్ణముతో సంశ్లేషము వచ్చినప్పుడు గురుత్వలఘుత్వ వైపరీత్యము గలుగదు." అని యిట్లు చిత్రంబుగ వ్రాయంబడియె. అహహా చూడుఁడు ! ఈసూత్రకారునిచే సంశ్లేషాక్షరమున కెట్టిసామర్థ్యంబు చెప్పఁబడినదో ! తన పై యక్కరములు దేవ[1]దానవులవంటివైనను సంయుక్తాక్షరములు తాము దలఁచినట్లైన వాని నెట్లు చేయదొరకొన్న నట్లు సేయఁగలవఁట. భారతంబులోనే యున్న మఱియొక ప్రయోగంబు చూపుదము -

  1. గీ. జ్ఞాతివైరంబు నంది ప్రాసంబులందు, విశ్రమములందుఁ దమలోన వేఱు గలిగి దేవ దానవులట్లన తెనుఁగులందు,మించి రేఫఱకారముల్ మెఱయుఁ గృష్ణ. అ. క.