పుట:Kavijeevithamulu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నన్నయభట్టు.

49

ఇట్టిబిరుదము లుండుటంబట్టి యితఁడు కేవలవైదికవృత్తిలో నున్నట్లును, కావున వైదికశాఖలోనిబ్రాహ్మణుఁ డనియును కొందఱూహించెదరు. కాని "లోకజ్ఞున్" అని యితఁడు చేసియున్న ప్రయోగముంబట్టి యితఁడు లౌకికుఁడుగూడనై యుండవచ్చు నని తోఁచుచున్నది. పూర్వకాలములో లౌకికవైదిక వ్యాపారములు లౌకికులవలననే జరిగింపఁ బడినట్లుగా గ్రంథములవలనం గాన్పించెడిని. ఇపుడు మనము మాటలాడుచున్న నన్నయభట్టుకాలమునాఁటికి వైదికు లని ప్రకృతమునఁ బిలువంబడుచున్న బ్రాహ్మణశాఖ వేఁగిదేశమునకు వచ్చియున్నదా ? లేదా ? అని యూహింపవలసినదిగా నున్నది. అట్టిస్థితిలో నన్న పార్యుఁ డది వఱకు దేశములో రాజాస్థానములయం దుండి లౌకికవైదిక కార్యములను నెఱవేర్చుట కేర్పడినని యోగిశాఖలోనివాఁడు గాక తదనంతర మొకటి రెండుశతాబ్దముల కీదేశమునకు వచ్చినవైదికశాఖలోనివాఁ డెట్లగు నని యోజింపవలసి యున్నది. అప్పటిచాళుక్యరాజులతో నీదేశమునకు వచ్చి యుండుబ్రాహ్మణులు తమప్రభువులతోపాటు పశ్చిమదేశస్థులే అయి యుండవలయును. తమప్రభువు లగుచాళుక్యులు మహారాష్ట్రదేశములో బీజపూరుసంస్థానములోని దగు 'కళ్యాణి' పురమునుండి వచ్చియుండిరి. అక్కడిప్రభుఁడు సత్యాశ్రయవల్లభుఁ డనియు నతనితమ్ముం డగుకుబ్జ విష్ణువర్ధనుఁడు తూర్పుదేశమును జయించుటకుఁగానువచ్చి, వేఁగిదేశ మాక్రమించుకొని పాలించినట్లును అతనిసంతతిలోనివాఁడే పైపద్యములోనిచళుక్యాన్వయా భరణుఁ డగురాజనరేంద్రుఁ డనియును రాజనరేంద్రచారిత్రములో వివరింపఁబడిన శాసనములవలన విస్పష్టము కాఁగలదు. మహారాష్ట్రదేశములోని పశ్చిమఖండమునుండి వచ్చినరాజులకు వంశానుగత మైనపురోహితులుగానుండువారు ఆదేశమునం దుండెడువారు గాక నవీనరాజ్యమగునాంధ్రదేశములోని వారలై యుండరు గదా. రాజనరేంద్రుని కాలమునకుఁ బశ్చిమచాళుక్యశాఖ అంతమగుటంజేసి కావలయును. వారిస్వాధీనములో నుండెడుదేశ మంతయు ననఁగాఁ గొంకణదేశము చివరవఱకును నీరాజనరేంద్రుని స్వాధీనములో నున్నట్లుగాఁ