పుట:Kavijeevithamulu.pdf/60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రీరస్తు.

కవిజీవితములు.

2.

నన్నయభట్టు.


ఇతఁడు తాను రచియించినభారత ప్రథమపర్వములోఁ దనవృత్తాంత మీక్రిందివిధముగ వ్రాసి యుంచె నదెట్లన్నను :-

సీ. తనకులబ్రాహ్మణు ననురక్తి నవిరళ, బపహోమతత్పరు విపులశబ్ద
   శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది, నానాపురాణవిజ్ఞాననిరతుఁ
   బాత్రు నాపస్తంబసూత్రు ముద్గలగోత్ర, జాతు సద్వినుతావదాత చరితు
   లోకజ్ఞు నుభయభాషాకావ్యరచనాభి, శోభితు సత్ప్రతిభాభియోగ్యు

అ. వె. నిత్యసత్యవచను మత్యమరాధిపా, చార్యు సుజను నన్న సార్యుఁ జూచి
       పరమధర్మ విదుఁడు వరచళుక్యాన్వయా, భరణుఁ డిట్టు లనియెఁ గరము ప్రీతి.

అనుదీనిం బట్టి చూడ నీనన్న యభట్టు, 1. రాజునకుఁ గులబ్రాహ్మణుఁ డనియును, 2. జపహోమతత్పరుఁ డనియును, 3. శబ్దశాసనబిరుదాంకితుఁ డనియును, 4. వేదాభ్యాసి యనియును, 5. ఆపస్తంబసూత్రుఁ డనియును, 6. ముద్గలగోత్రుఁ డనియును, 7. బ్రహ్మాండాది పురాణములు తెలిసినవాఁ డనియును, 8. లోకజ్ఞానము గలవాఁడనియును, 9. ఉభయభాషాకావ్యరచనాశక్తియుతుం డనియును దేలుచున్నది.

వీనిలో మొదటివిశేషముంబట్టి రాజవంశానుక్రమముగ నాశ్రయించియున్న పురోహితుఁ డనియును, రెండవదానింబట్టి యాజ్ఞికతంత్రమున సమర్థుఁ డనియును, మూఁడవదానింబట్టి వ్యాకరణవేత్తయనియును, అందులో నుపాధ్యాయత్వముంగూడ సంపాదించినవాఁ డనియును, నాల్గవదానింబట్టి సాంగ వేద వేది యనియును, అయిదవదానింబట్టి పౌరాణికశ్రేష్ఠుం డనియును, తొమ్మిదవదానింబట్టి ఆంధ్రగీర్వాణకావ్యరచనా దక్షుం డనియును నిశ్చయ మగుచున్నది.