పుట:Kavijeevithamulu.pdf/578

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

572

కవి జీవితములు.

ఇట్లు ధారాళముగాఁ జెప్పినపద్యమున కే సందియము నుండఁ గూడదు. నన్నయభట్టారకుఁడు తనకు సహాయుఁడయిన నారాయణ భట్టుంగూర్చి యిట్లె వ్రాసెను. దానికిఁగూడ నారాయణభట్టు భారతము చేసి నన్నయభట్టుపేరు పెట్టె నని చెప్పవచ్చును. ఎట్లన్నను :-

ఉ. పాయక పాకశాసనికి భారతఘోరరణంబునందు నా
    రాయణుఁ డట్లు తానును ధరామరవంశవిభూషణుండు నా
    రాయణభట్టు వాఙ్మయధురంధరుడుం దన కిష్టుఁడున్ సహా
    ధ్యాయుఁడు వైనవాఁ డభిమతంబుగఁ దో డయి నిర్వహింపఁగన్.

అని నన్నయభట్టును ధారాళముగఁ జెప్పెను. పుష్పగిరితిమ్మన్న పాపరాజునకును, నారాయణభట్టు నన్నయభట్టునకును సహాధ్యాయులని చెప్పియుండ నట్టి సహాధ్యాయు లుభయులు సమానప్రజ్ఞ గలవారని లోక మెందు కూహించదో తెలియదు. పుక్కిటిపురాణముల నమ్మి వ్రాఁతమూలనును దిరస్కరించులోపము మనయాంధ్రులలో నింక నెంతకాలమువఱకుండునో దాని నూహింపలేకయున్నాను. కంకంటి పాపరాజు మఱియొకపద్యములోఁ బుష్పగిరి తిమ్మన్న తనకు సహాయుం డని చెప్పె. ఎట్లన్నను :-

"మ. హనుమద్దివ్యప దారవిందమకరందానంద నేందిందిరా
       త్ము ననేకాంధ్రకృతిప్రకల్పవసమర్థుం బుష్పగిర్యప్ప నా
       ర్యునిసత్పుత్త్రునిఁ దిమ్మనాఖ్యకవిచంద్రున్ మత్సహశ్రోతఁ బ్రొ
       ద్దున నే పిల్వగఁ బంచి కన్న కల సంతోషంబుతోఁ జెప్పినన్."

పాపరాజుప్రజ్ఞావిశేషము లెఱుఁగనివా రాతనియాశ్వాసాంత గద్యములో నుండు కొన్ని బిరుదులం జూచియైన నతని పాండిత్య మరయుదురుగాక. అందులో.

1. చతుర్విధ అనపద్య కవిత్వ విద్యావధానుఁడు. 2. అదునాతనభోజరాజు. 3. బంధురమనిషా విశేషమంథానవసుంధ రాధర శోథితగణితశాస్త్రరత్నాకరుఁడు. 4. విష్ణుమాయావిలాసాభిధానయక్షగాన నిర్మాణ ప్రవీణతానిధానుఁడు.