పుట:Kavijeevithamulu.pdf/521

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ కృష్ణదేవరాయలు.

515

వివరించెదను. ఇది చర్విత చర్వణముగా భావించక పాఠకులు దీనిని జదువ శ్రద్ధాళువు లగుదురుగాక.

Local Records Vol. XIX page Į25 to Į88

కైఫీయతు మవుజే చామర్లకోట.

"కపిలేశ్వర గజపతి కుమారుఁ డైనపురుషోత్తమగజపతి ఆంధ్రకళింగ దేశముల ప్రభుత్వముచేసినాఁడు. ఈయనకుమారుఁడైన ప్రతాపరుద్ర గజపతి కళింగాంధ్రదేశము లేలుచుండి పశ్చిమ ముదయగిరి పర్యంతము ప్రభుత్వముచేసిరి. ఉదయగిరి దుర్గములోను గజపతి వారితరపున తిరుమల దేవరాయ మహాపాత్రుని నుంచిరి. కొండవీటిదుర్గములోఁ బ్రతాపరుద్రగజపతి కుమారుఁడు వీరభద్రగజపతి, కుమారహంవీర పాత్రుని కుమారుఁడు నరహరిదేవు, శ్రీనాథరాజు రామరాజు, కుమారుఁడు లక్ష్మీపతిరాజు, జన్యామల కసవాపాత్రుఁడు, సుప్రపాల చంద్ర ,అహాపాత్రుఁడు, పూసపాటి రాచిరాజు, రాచూరిమల్లయఖాను, ఉద్దండభానుఁడు, వీరుతగినసైన్యములతో నుండిరి. కళింగదేశపు ప్రభుత్వము చేయుచున్న ప్రతాపరుద్ర గజపతి కటకపురియందు సింహాసనస్థుండై ప్రభుత్వము చేయుచుండేవాఁడు."

"పశ్చిమరాజ్యమందు విద్యానగర పట్టణమందు నరపతి రాయ సింహాసన మునకు అధిపతు లైనశ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీవీరకృష్ణదేవరాయమహారాయలు సైన్యముతోఁ గూడ తరలిపోయి, ఉదయగిరి దుర్గము సాధించి, దుర్గముమీఁద నున్న తిరుమల రౌతరాయ మహాపాత్రునిఁ బట్టుకొని, అక్కడనుండి సైన్యముతోఁగూడ కదిలివచ్చి వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, అద్దంకిఁ అమ్మనబ్రోలు, తంగేడు, కేతవరము మొదలయిన గిరిదుర్గ స్థలదుర్గములను సాధించి, కొండవీటికి విచ్చేసి దుర్గము చుట్టువాఱనడ చప్పరములు వెట్టించి, దుర్గము లగ్గలు విడిపించి అందుమీఁదనున్న పాత్రసామంతులను, మన్నెవారిని జీవగ్రాహముగా బట్టుకొని, వారికి అభయదానము నిచ్చి అక్కడినుండి విద్యానగరమునకు విజయముచేసి