పుట:Kavijeevithamulu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

కవి జీవితములు



మైలమభీమునికూటస్థు లగు ముక్కంటిరాజు, బుద్ధవర్మ, మాధవవర్మ మొదలగువారితో నీదేశములోనికిఁ దత్సహాయార్థమై వచ్చియుండిరి. అదికారణముగాఁ దమకుఁ బ్రభువులుగా నుండెడు నీమయిలమ భీముని యన్వయంబులోనివారికి నమస్కరించు నాచారము గలదు. కావున నీబిరుదు గల్గినది.

67. రాయసంస్థాననృప ప్రాణవాయుభుజ గుండు - రాయసంస్థానము కర్ణాటరాజులసంస్థానము. తత్సంస్థాననృపతుల సంహరించె నని కలదు.

68. నిజస్నానోదకకుష్ఠరుజానివారకుండు - వీరిలో నొకరు స్నానముచేసి తనబట్ట పిడిచిననీరు పోసిన నొకకుష్ఠురోగికి వెంటనే గుణమిచ్చె నని కలదు.

69. స్థలదుర్గవిజయనగరశిలాప్రాకారవిభుఁడు - అనంతర కాలములో విజయనగరము స్థలదుర్గముగాఁ జేయఁబడినది. అందు శిలాప్రాకారము గట్టింపఁబడియె. ఇదియ ప్రస్తుతము మైలమభీమునివంశస్థులకు రాజధాని.

70. జలదుర్గభీమపట్టణాధ్యక్షుఁడు - విజయనగరము సమీపమున నుండు భీమునిపట్టణము వీరికి జలదుర్గముగా నుండెను.

71. వనదుర్గమత్స్యపురవిభుఁడు - మాడుగులకు మత్స్యపుర యని నామాంతరము గలదు. ఇది వనదుర్గముగా నుండెను.

72. గిరిదుర్గముఖ్యనందాపురీప్రభుఁడు - ఈనందాపుర మిప్పటి జయపురపుసంస్థానమునకుఁ బూర్వము ముఖ్యపట్టణము. అపట్టణము వీరికి జలదుర్గముగఁ గొంతకాల ముండెను.

73. విజయభేరీప్రముఖవాద్యనవకైరవావనవరబిరుదధౌరేయుఁడు -

74. మననజమణికిరీటకనకచ్ఛత్రమత్స్యధ్వజసింహతలాటవీరకాహళాద్యనేకబిరుదాంకసముజ్వలుఁడు -

75 నీలగిరినాయకప్రతిష్ఠాపకుఁడు - అనఁగా సింహాచలస్వామిని బ్రతిష్ఠచేసె నని యర్థము.