పుట:Kavijeevithamulu.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ కృష్ణదేవరాయలు.

481

తకాలమునకు పిదప పట్టమహిషి యగుతిప్పాంబకూడ గర్భముదాల్చి మొగశిశువును గనెను, ఈశిశువునకు నృసింహరాయ లనునామ మేర్పడెను. నాగు యనుదానికి రాజుగారితో స్నేహ మగుటం జేసి నాగమాంబ యనుపేరు వచ్చెను. తిప్పాంబకుమారుఁడును నాగమాంబ కుమారుఁడును వయస్సులో సమానులైనను, రూపలావణ్యముల యందును, విద్యావిసయములయందును, ధైర్య స్థైర్యములయందును, దాసీపుత్త్రుఁడు రాణిపుత్త్రునికంటె నూఱురెట్లతిశయించియుండెను" అని యున్నది. ఈరెండుకథల నమ్మినను నమ్మకున్నను వేఱుచరిత్ర లేదు.

కృష్ణరాయని పూర్వుల వృత్తాంతము.

దీనింగూర్చి పారిజాతాపహరణ, మనుచరిత్రములలోఁ గొంత కానుపించును. మఱికొంత "కొంగదేశ రాజకాల్" అను వచనగ్రంథములోపలను గానుపించును. ఇందులో మొదటిరెండుగ్రంథములును గృష్ణరాయాస్థాన విద్వాంసులవలన రచియింపబడెఁ గావున విశ్వసనీయములు. మూఁడవ గ్రంథము గవర్నమెంటు Oriental M. S. S. లైబ్రేరీలో, నూఱుసంవత్సరములక్రిందటఁ జేరియుండిన దైనను కృష్ణరాయలకాలీనులవలన రచియింపఁబడక అటుపిమ్మటఁ గొన్నిశతాబ్దము లైన యనంతర మొరునచే రచియింపంబడుటచేత విశేషవిశ్వసనీయము కాదు. ఎట్లున్నను చారిత్రములలోఁ జేరి నిల్చియున్న గ్రంథమగుటం జేసి దానినిగూడఁ జేర్చుకొని యితరగ్రంథసహాయమున నందులో భేదించునట్టి యంశముల వివరించి చెప్పెదను. కృష్ణరాయని పూర్వులవంశము చంద్రవంశ మైనట్లును, తుళువ యను పౌరుషనామంబు గలది అయినట్లు నీక్రింది పద్యమువలనం గాన్పించును.

చంద్రవంశములో నొకపురుషుఁడు.

"క. అతనికి యదుతుర్వనులను, సుతు లుద్భవమంది రహితసూదనులు బలా
     న్వితమతులు వారిలో వి, శ్రుతికీర్తి వహించెఁ దుర్వసుఁడు గుణనిధియై.