పుట:Kavijeevithamulu.pdf/485

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ కృష్ణదేవరాయలు.

479

నాదేహంబు జాడ్యంబున నుబ్బియున్న యది. కావున నీయుంగరం బే యుపాయంబుచేతను రాకుండ నున్న యది. దీని నెట్లైనఁ దీసికొన సమర్థుం డగువానికి నారాజ్యం బిచ్చెద ననుడు వారు గ్రమంబునఁ జనుదెంచి దానిం దీయ ననేకవిధంబుల యత్నించి వేసరి సేయునదిలేక యూరకుండిరి. అపుడు నారసింహుండు తిమ్మరుసుం జూచి కృష్ణరాయం డుండిన నిపు డెంత మేలై యుండు నాతని దుర్మార్గులు చంపించి రనుడు తిమ్మరుసు సెలవేని కృష్ణరాయనిం దెచ్చెద నని తెల్పిన సంతసించి యాతనిఁబిలువనంపి కౌఁగలించుకొని కృష్ణా ! ఉంగరము దీసికొ మ్మనుడు మొల నున్నకత్తిచే నాతని వ్రేలు దునిమి రాయం డాయుంగరముఁ గైకొనియె నరసింహరాయం డాతని సాహసంబునకు మెచ్చి తనసామంతమంత్రివరుల కాతనిం జూపి తనయనంతరంబున నాతనినే రాజుగ నియమించి పట్టముం గట్టుఁ డని తాఁ బరమపదప్రాప్తుం డయ్యె. అనంతర మామంత్రివరులు రాజాజ్ఞానుసారంబుగ నతనికిఁ బట్టాభిషేకం బొనరించిరి. అని యుండుకథయంతయును కల్పిత మయినట్లు నిది యేమఱియొకరాజుకథయో యీతని కతుకంబడినట్లునుతోఁచెడిని. శూద్రస్త్రీసంభవుఁ డనుకథ ప్రౌఢదేవరాయని దని వెలమలచారిత్రము వలనం గాన్పించెడిని. నరపతు లగువిజయనగర రాజుల చారిత్రములోఁ బ్రౌఢదేవరాయవృత్తాంతములోఁ జూడనగును. కొండవీటిదండకవిలెలో నీపైవృత్తాంతము కొంచెము విపులముగా నున్నట్లును దానిసంగ్రహమును తాఁ బ్రచురించుచున్నట్లుగాఁ బురుషార్థప్రదాయిని అనుపత్త్రికలోఁ గొన్నిసంగతు లొకపాంథునివలనఁ బ్రకటింపఁబడియెను. అదెట్లన్నను :-

కృష్ణదేవరాయలజన్మకర్మము.

"రాచవేమనతో రెడ్లప్రభుత్వ మంతరించిన దని యి దివఱలోఁ దెలియఁజేసియుంటిని. రాచవేమనగారు ఆపుత్త్రవంతుఁ డగుటంజేసి కొండవీటిరాజ్యమంతయు వేమనయొక్క డెబ్బదియిద్దఱు పాలెగాం