పుట:Kavijeevithamulu.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

478

కవి జీవితములు.

బు నడపె. అనంతరము తిమ్మరుసు రాజుకడ కేతెంచి యాతని నారాత్రి స్వీయతో సుఖంబుగ నుండుమని తెల్పె. రాజును తిమ్మరుసు మాటలయెడం గౌరవ ముంచి యంతిపురికిం జని పట్టపుదేవిం బిలువంబంచిన నాపె కారణాంతరముచే రాలేదయ్యె. దాని కెంతయు వగచుచు నాపెచెలికత్తెలలో నొక్కజవరాలిం గూడి యాదినంబు సుఖంబుగ నుండె. తోడనే యాయింతి గర్భంబు దాల్చె. నవమాసంబులు నిండినయనంతర మాయింతి యొక శుభముహూర్తంబున దేవకి కృష్ణునిం గన్నట్లు తాఁ గృష్ణరాయనిఁ గనియె. ఆవార్త విని నరసింహరాయండు విశేషోత్సవంబు సేయించె.పుత్రుని జూచి యాతని తేజోధికతకుఁ దండ్రి యెంతయు సంతసిల్లె. అప్పటి నుండియు నీతని నతి ప్రేమచేతఁ కాపాడుచుండె. అప్పు డీ నరసింహరాయనికి బీజనగరదేశ మంతయు స్వాధీనమయ్యె. దానిచేఁ గృష్ణరాయం డెంతయు నదృష్టవంతుం డని యాతండు మఱియుం బ్రేమాతిశయంబున నాదరింపుచుండె. రా జిట్లుండుటచే నోర్వలేక రాజభార్య లతనిం జంపయత్నంబు లొనరించి యాతనిఁ జంపఁబంపిరి. అపుడు తిమ్మరుసు కృష్ణరాయనియెడ మిగుల నెన రుంచి యాతనిఁ దనమందిరంబునకుఁ గొని తెచ్చి యచ్చటఁ జిరకాల ముంచి సంరంక్షించె. కృష్ణరాయ లిలువెడలు సమయంబున నెనిమిదితొమ్మిది సంవత్సరములవాఁడు. ఈతనికిఁ దిమ్మరుసు జాగరూకుండై విద్యాబుద్ధుల నేర్పుచుండె. ఇట్టిసమయంబునఁ దిమ్మరుసును అప్పా అని యీరాయండు పిల్చుటం జేసి యీతనికి నప్సరుసను నామాంతరంబు గల్గె.

నరసింహరాయనికి స్వీయాసంభవు లగుకొడుకులు గలరు. నరసింహరాయనికి శరీరంబున జాడ్యంబు సంప్రాప్తమై అది క్రమక్రమంబుగ హెచ్చినపుడు జీవితేచ్చ వదలి నరసింహరాయండు తనపుత్త్రులఁ బిలిచి వారిలో ధైర్యసాహసంబులు గలవానికి రాజ్యం బిచ్చెదఁగాక యని నిశ్చయించి తనచే నున్న భద్రముద్రికం జూపి యోపుత్త్రులారా