పుట:Kavijeevithamulu.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ కృష్ణదేవరాయలు.

477

N. - B. ఈచివర నిద్దఱు కవులయొక్క కాఁపురస్థలమును వారు రచించినగ్రంథముల పేళ్లును తెలియదు. అల్లసానిపెద్దన మనుచరిత్రమును రచించి కృష్ణదేవరాయులకుఁ గృతియియ్యఁగా నట్టికావ్యము వెనుక రాయలవారు ఆముక్తమాల్యదను చేసిరి. ఇది గాక సకలకథాసారసంగ్రహము, రసమంజరి మొదలగు నేనేకగ్రంథములు రాయలవారు రచించిరి. అని యున్నది. పైదానిలో భట్టుమూర్తి వసుచరిత్ర రచియించినట్లు చెప్పితిని. శంకరకవి కృష్ణరాయల సంస్థానములోని వాఁడు కాఁ డని మాత్రము చెప్పవలసియున్నది.

కృష్ణరాయని జననవృత్తాంతము.

ఈ కృష్ణదేవరాయలజననంబున కొకకథ కలదు. దీని నిచటి సంప్రదాయజ్ఞు లందఱు వాడుకొనున ట్లీక్రింద వివరింతము. ఈతనితండ్రి యైనతెలుఁగుదేశపు నరసింహరాయఁడు త్రిలింగదేశంబున రాజ్యంబు సేయుచుండె. ఈతం డొకనాఁటిరాత్రి కాలోచిత కృత్యంబులు నివర్తింప బహిర్దేశంబునకుం జనియుండ నంతరిక్షంబునుండి యొక్క రిక్క మిక్కిలి తేజంబుతో నాతని యుదకస్థాలింబడియె. దానిం జూచి యా రాజు తనచేత నాపాత్రంబు మూసి యనతిదూరంబున నున్న నిజభటుం బిలిచి యోరీ అప్పనికి (తిమ్మరుసునకు) ఈవార్త దెల్పుము అనుడు నాభృత్యుండు వేగిరంబ చని దాని నెఱిఁగించిన నాతం డానీరుద్రావు మని రాజుతోఁ జెప్ప నుత్తరం బిచ్చె. వాఁ డావార్తను రాజునకుఁ దెలిపినతోడనే యాతండు తిమ్మరుసు నాజ్ఞానుసారంబుగాఁ గార్యం