పుట:Kavijeevithamulu.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

కవిజీవితములు.

ప్రౌఢప్రబంధకవులచరిత్రము.

19.

తుళువవంశము

శ్రీకృష్ణదేవరాయలు.

(ఇపుడు వ్రాయఁబూనుకథ సంప్రదాయజ్ఞులచే వాడికొనఁబడు.)

ఈతండు చంద్రవంశ సంజాతుం డగునరసింహరాయనికుమారుండు. ఆనెగొందె యనియు, [1]

విజయనగర మనియుఁ బలుకంబడు తుంగభద్రా తీరంబున నున్నపట్టణం బీతనిరాజధాని. ఈతనికి నాంధ్రభోజుం డనుప్రసిద్ధి గలదు. ఆంధ్రభాష సంపూర్ణంబుగ నీతని కాలంబుననే వృద్ధిబొందెను. ప్రబంధరచనం బీతనినాఁడే కలిగె. అందు మొదటి ప్రబంధం బగు మనుచరిత్రం బంధ్రకవితాపితామహుం డనంబరగిన యల్లసాని పెద్దనచే రచియింపఁబడియె. దాని కీతండు కృతినాయకుండు. ఈరా జెల్లపుడుఁ బండితజన గోష్టి నుండి వారితో విద్యావినోదంబులు సలుపుచుండు. వారిలో నాంధ్రకవనమున కెనమండ్రు ముఖ్యులు. వీరికే యష్టదిగ్గజంబు లని పేరు. అం దల్లసాని పెద్దన, పారిజాతాపహరణరచనాధురంధరుం డగునందితిమ్మన, పాండురంగవిజయ నిర్మాణకుఁ డగుతెనాలిరామకృష్ణకవి, నరసభూపాలీయనిర్మాణదక్షుం డగుభట్టుమూర్తియు, రామాభ్యుదయమును రచించినయయ్యలరాజు రామభద్రకవియు, కాళహస్తిమహాత్మ్యకర్త యగుకవిధూర్జటియును, ద్విపదకావ్య రచనాప్రవీణుం డగు తాళ్లపాకచిన్నన్నయును,

  1. బీజనగరము