పుట:Kavijeevithamulu.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

464

కవి జీవితములు.

అని యున్నదానితో నన్నియంశములలో నే నేకీభవింపను. ఆంగ్లేయులప్రభుత్వములో క్రీస్తుని పందొమ్మిదవ శతాబ్దాంతములో నభివృద్ధిలోనుండునాంగ్లేయవిద్యాప్రాబల్యము నందియు, వారినాగరకతాలక్షణములు తెలిసికొని వారితోఁ గలసి మెలసి వ్యవహరించుచుండు మన యాంధ్రపండితులు నేఁటివఱకు స్వదేశ జన్య మైనయసూయాపిశాచ గ్రస్తులు కాక తప్పించుకొనలేక యెవరైన కష్టపడి యొకగొప్ప యుద్యమము చేయుచుండ నోర్వలేక దానికి విఘ్నములు గాని లేక అది తాముం జేసితి మనిపించుకొనినఁ గొంత యెదట వానిప్రతిష్ఠ తగ్గినఁ దగ్గుం గాక యని యుద్యమించుచుండ, నాల్గుశతాబ్దముల క్రింద నున్నసర్వాధికారుల మనుకొనురాజులసభలలో నగ్రతాంబూలము గ్రహించి మించుచున్న పెద్దన్నవంటి హిందూపండితుఁడు. తనతో సమానుఁడు గాఁ గానీ తనకంటె నధికుఁడనిగానీ భావించఁదగినకవికర్ణరసాయన గ్రంథకర్త యగునారసింహకవిని రాజదర్శనార్థంబుగఁ దోడ్కోనిపోవు నని యాధునికాచారముం బట్టిచూచిన నిర్ణ యింప వశమై యుండదు. కావున నసూయయే యితనిగ్రంథము కృష్ణరాయల సన్నిధికిం బోకుండఁ జేసిన దానికిఁ గారణ మై యుండును. పెద్దనార్యమనుచరిత్రమునకంటె నారసింహ కవికృత కవికర్ణరసాయనము ఎన్నివిధముల నధికమైనదో దాని నాయిర్వురి శైలీవిశేషంబులఁ జూపుచో వివరించెదను. ఇపుడీనృసింహ కవి గ్రంథము రాజునకుఁ గృతినిచ్చుటకు యత్నించెనా అనుదానిం గూర్చి చర్చించెదను. ఎట్లన్నను :-

నృసింహకవి గ్రంథరచనావిషయము

దీనింగూర్చి నృసింహకవివలననే కొన్ని వాక్యంబులు చెప్పంబడినవి. అవియెట్లన్నను :-

"వ. అని వితర్కితపూర్వకంబుగా నపూర్వవిరచనా చాతుర్యంబు నెఱయ మెఱయ నన్వర్థనామంబుగాఁ గవికర్ణరసాయన మనునొక్క కావ్యంబు రచియింప సున్ముఖుండనై యనుకూలనాయకా న్వేషణపరాయత్తం బైనచిత్తంబున"