పుట:Kavijeevithamulu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేములవాడ భీమకవి

35

43. బల్లాడగోధూమఘట్టనఘరట్టుఁడు - ఇందలిబల్లాడశబ్దము కటకదేశపుప్రభుఁ డగుభల్లహునియందును వర్తించును బల్లాణ వంశస్థు లని పశ్చిమదేశమున నొకసంస్థానమువారు గలరు. వారికిఁ జెల్లినఁ జెల్లును. కొంతకాలము క్రిందట వీరిరాజ్యము తూర్పునఁగటకమువఱకును, పడమట దేవగిరివఱకును వ్యాపించి యుండుటంబట్టి యీబల్లాడశబ్ద మెట్లన్వయించిన నన్వయింపవచ్చును. లేదా యిద్దఱయెడల వర్తించిన దని చెప్పినఁ జెప్ప నొప్పును.

44. భోజరాజదిశాధట్టుండు - దీనికిఁ బాఠాంతరము భోజరాజదిక్ప్రవీణకీలికీలాక రాళుఁ డని కలదు.

45. చాళుక్యరాజరాజ్యస్థాపనాచార్యుఁడు - చాళుక్యులు పూర్వ చాళుక్యులు పశ్చిమచాళుక్యు లని రెండు తెగలవా రుండిరి. అందుఁ బూర్వచాళుక్యుల ముఖ్యపట్టణము రాజమహేంద్రవరము. పశ్చిమచాళుక్యులముఖ్యపట్టణము కళ్యాణ పురము. ఇదివఱలో 34 వ బిరుదులోఁ గళ్యాణ పురములోని చాళుక్యులఁ గూర్చి వ్రాసియున్నాఁడు గాన నిపు డీ బిరుదు పూర్వరాజ్యమం దుండు రాజమహేంద్రచాళుక్యులకుం జెల్లును. వీరిలో రాజనామము రాజనరేంద్రునకుఁ జెల్లును. ఈరాజనరేంద్రుని తండ్రి యగువిమలాదిత్యుఁడును, మైలమభీమనయును సమకాలీనులు. మైలమభీమన విమలాదిత్యుని యనంతరము రాజనరేంద్రుని వేంగీసింహాసనము నం దెక్కించి యుండిన నుండవచ్చును. లేదా యీవంశములో మఱియొకరికైన నీబిరుదు చెల్లు నని చెప్ప నొప్పియున్నది.

46. ఒడ్డిరాయ మీజాలికవర్ముఁడు - పాఠాంతరము. ఒడ్డిమహీరాయ సముదాయజీవనవిహారసమున్న త్కరవాలుఁడు - ఒడ్డియరాయ మస్తకశూల ధరుఁ డని యింకొక పాఠాంతరము. ఒడ్డిరాయఁ డనఁగా నోఢ్రరాజు. (King of Orissa.)

47. జలదుర్గదీవిమన్నె యనివేశుఁడు - ఇట దీవిసీమలో జలదుర్గము గల్గియుండె నని యభిప్రాయముగా నోవు. ఇది కృష్ణానది తీరములోనిది