పుట:Kavijeevithamulu.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

462

కవి జీవితములు.

నద్దానిం గొని విజయనగరమునకుం బోయి అట్టిప్రబంధ విషయమై లెస్సగ నెఱిఁగినట్టియు రాజునకు మిగుల గౌరవనీయుఁ డగునల్లసాని పెద్దనకుం జూపించి తనకు రాజదర్శనంబు చేయించు మని కోరఁగాఁ బెద్దన దానిని సావకాశంబుగఁ జూచి అది రాజుకడకుఁ బోయినవిశేష సన్మానం బాకవికిం దెచ్చు నని తలంచి ఆకవికి రాజదర్శనంబు కాకుండు నుపాయ మారయుచుండెను. ఈ నూతనకవియును రాజదర్శనం బగుననుకోర్కెచేఁ దాఁ జిరకాలం బచ్చో సొంతసొమ్ము వెచ్చించుచు నుండెను. తుదకుఁ జేతనున్నధనంబు వ్యయమగుడు నేమియుఁ దోఁచక యూరకున్న నే మగు నని తనగ్రంథములో నున్న నాల్గుపద్యములం దీసి వానిం దనపరిచారకుచే నంగడికిం బంపి విక్రయించి రమ్మనెను. వాఁడును ఆపద్యంబులం గొని గ్రామంబంతయుఁ దిరుగుచు పద్యమునకు వేయి వరాలు విలువ యని కేక వేయుచు రాజుకోటలోనికి వచ్చెను. ఆదిన మా కోటలో రాజకుమారిక హర్మ్యాగ్రంబున విహరించుచుండెను. ఈకేక నాపె విని యాపద్యంబులం దెప్పించి చూచి మిగుల సంతసించి వాఁడడిగినమూల్యము నిచ్చి వానిని విలిచితాఁ బఠియించెను.

ఇట కవికర్ణరసాయన గ్రంథకర్త యీవచ్చినధనంబు పుచ్చుకుని మఱికొన్నిదినంబు లుండి అప్పటికిని రాజదర్శనంబు గాకుండుటకు లో వగచి ధనాశచే నిట్టికృతి మనుజుల కిచ్చుట తుచ్ఛం బనియు దీని నిఁక నాముష్మికార్థి నై శ్రీరంగనాథున కిచ్చి ధన్యుండ నయ్యెద నని నిశ్చయించి యచ్చోటు వాసి శ్రీరంగంబునకుం బోయి అచ్చో నద్దాని భగవదర్పణచేసి కృత్యాదిని శ్రీరంగమాహాత్మ్యంబు వచియించి ధన్యుండయ్యె నని ప్రతీతి గలదు.

అట కృష్ణరాయనికూఁతురు పద్యంబుల గ్రహియించి సంతసంబుననుండి యొకనాఁడు తండ్రి వచ్చిన నతనితోఁ జతురంగమాడఁ దొడంగె. అపు డొకపేదా (బంటు) రెండు పెద్దజంతువులనడుమం బడినఁ గని యాచిన్నది "ఉద్ధతులమధ్యఁ బేదల కుండఁ దరమె." అనుడు రా జా