పుట:Kavijeevithamulu.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిష్టు కృష్ణమూర్తి కవి.

455

లిచ్చుట ప్రభుఁడు మానినట్లు కృ. కవి చెప్పి తనశిష్యునిచేఁ జదివించె నని యాగ్రహించి ప్రభుఁడు కృ. కవి యెడ ననాదరముం జూపెను. ఇది దైవకృతమే కాని కృ. కవియుద్దేశము కా దని వాడుక.

అశ్వశాస్త్రరచన.

ఈ కృ. కవి మాడుగులలో నుండగాఁ గృష్ణ భూపతి యొక్క మోహపుత్త్రుఁడగు జగన్నాథుఁ డనునతఁ డొకగుఱ్ఱముం దీయుటకు యత్నింప దానికి నశ్వశాస్త్రవేత్తలు గొందఱు మెడక్రింద గోఁగుగల దనియు అది యొక దోషమనియుఁ జెప్పిరి. అయిన నాగుఱ్ఱముయొక్క పొంకమును సురూపముం జూచి జగన్నాథుఁ డద్దానిని వదల లేక యీ కృ. కవికిఁ గనుసైగ చేసి, కృష్ణభూపతితో నీ కృ. కవియును అశ్వశాస్త్రములో మిగులఁ బండితుఁడు. వారికడ గ్రంథము లేవైన నుండును. వారియభిప్రాయము నరయుట మంచి దని విన్నవింప నటులైన మీకడ నుండుగ్రంథముం దెప్పింపుఁ డని కృష్ణభూపతి కృ. కవికిఁ జెప్పెను. అపుడు కృ. కవి తాను మఱునాఁడు దర్శనమునకు వచ్చినపుడు తెచ్చెదనని విన్నవించెను. అంతట నీజగన్నాథుఁడు కృ. కవి యింటికిఁ బోయి తన కాగుఱ్ఱముం గొనిపించునట్లు గ్రంథము జూపించిన విశేషధన మొసంగెద నని చెప్పిపోయెనఁట. దానికిఁ కృ. కవి సమ్మతించి ఆరాత్రి భోజనముచేసి తనదౌహిత్త్రుం డగుకృష్ణమూర్తి నామునిం బిలిచి ప్రాతఁతతాటాకుల యలేఖములం దెమ్మని చెప్పి వాని నొకగ్రంథములో మధ్య నిమిడించి సంస్కృతముతో నారదమహాముని యొకరాజన్యునకుఁ జెప్పినట్లశ్వశాస్త్రసంప్రదాయములన్నియుఁ బుంఖానుపుంఖములుగ మూఁడునాల్గువందల శ్లోకములు చెప్పి తెల్లవాఱుసరికి గ్రంథము సిద్ధముచేసి దానికి వర్ణము వేసి ప్రభువునకుం జూపించెనఁట. అట్టిగ్రంథము వినుట కందఱు నద్భుత మంది రనియు నందు గుఱ్ఱములకు గోఁగు కల్గియుండిన దానివలన దోషము లేకుండుటయే కాక గుణ విశేషములుకూడ బెక్కులు కల వని సూచింప దానికి సభవారందఱు