పుట:Kavijeevithamulu.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

కవిజీవితములు.

17.

శిష్టు కృష్ణమూర్తి కవి.

ఇతఁడు ద్వ్యర్థికావ్యకవి యగు ల. కవియొక్క కాలీనప్రసిద్ధ కవి. ల. కవితో నెదిరింపఁదగుకవిత్వసమర్థతయును, ల. కవి యెదిరింపలేని సంగీతప్రజ్ఞయుఁ గలవాఁ డని యీకృష్ణమూర్తికవి చెప్పఁదగి యున్నాఁడు. అయినను సర్వకామదాపరిణయపూర్వపక్షములచేఁగానోవు నీకృష్ణమూర్తికవి కవిత్వవ్యాపారమునకంటె సంగీతవ్యాపారములో నెక్కుడు ప్రతిష్ఠ సంపాదించెను. నేఁటికిని ఆంధ్రదేశమున నీకృష్ణమూర్తి కవి శిష్యులు పెక్కండ్రు సంగీతములోను బెక్కండ్రు సాహిత్యములోఁ గూడ బ్రసిద్ధు లగుముదుసలిపండితులుగా నున్నారు. ఈకృష్ణమూర్తి కవిని వృద్ధావస్థలో నీచరిత్రకారుఁడు తనబాల్యములో ననఁగా ఆ|| 1870 సంవత్సరప్రాంతములోఁజూచియున్నాడు. అప్పటి కాకవికి 70 సంవత్సరములకుఁ బైగా నుండినట్లు కాన్పించెను. ఎటుల నైన నీకవి జననకాలము (క్రీ. శ. 1800-77) = 1723 శాలివాహన సంవత్సరప్రాంతమై యుండును. ఈపండితుఁడు సర్ వాల్టరు ఎల్లియట్టుదొర (Sir Walter Elliot) దొర చరిత్రవిషయమై చేసినయుద్యమములో సహాయభూతుఁడుగా నుండుటంబట్టి యీచారిత్రోద్యమములోఁగూడ సహాయభూతుఁడైన వాఁడే అనిచెప్పవలసియున్నది. పైదొర శిలాశాసన పరీక్ష చేయునపు డీకృష్ణమూర్తికవి శాసనాక్షరశోధకుఁడై యుండెననియును ద్రాక్షారామములో నుండెడునసంఖ్య మగుశిలాశాసనములన్నియు నీకవివలననే యెత్తి వ్రాయంబడెననియు సంప్రదాయజ్ఞాభిప్రాయము.