పుట:Kavijeevithamulu.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

440

కవి జీవితములు.

సీసమాలిక.

మ ధువైరికి న్వనమాలికిఁ గౌస్తుభ
హా రునకును సంశ్రితావనునకు
రా ధికాప్రియునకు రామసోదరునకు
జ గదీశునకు దయాసాగరునకు
శ్రీ నాథునకును రక్షితదేవసమితికిఁ
బ్రౌ ఢభావునకు నారాయణునకు
సు రగేంద్రతల్పున కరిశంఖధరునకుఁ
దొ గలరాయనిఁ గేరుమొగముదొరకు
ర ణనిహతదుష్ట రాక్ష సరమణునకును
గా నమోహితపల్లవీకాంతునకును
రి పువిదారికి హరికి శ్రీకృష్ణునకును
కిల్బిషారికి నే నమస్కృతి యొనర్తు.

అనుపద్యంబు చూచి బ్రౌనుదొర సంతసించి ల. కవి వృత్తాంతమంతయు నరసి అతని కాంధ్ర గీర్వాణములలో దేనిలో విశేషపరిశ్రమము గల దని ప్రశ్నింపఁగ ల. కవి తాను శుద్ధాంధ్రకవి నని వక్కాణించె. అటు లైన నీ వమరసింహకృత నిఘంటువులో వివరింపఁబడిన సంస్కృత శబ్దముల కన్నిటికిఁ దెలుగులో సమానముగ నర్థము చెప్పఁ గలవా యని యడిగిన నది పరీక్షించినఁగాని తెలియ దని ల. కవి చెప్పెను. అంతట బ్రౌనుదొరయమరములోని యరుదైనశబ్దములలోఁ గొన్నిటికి శుద్ధాంధ్రపదముల నడుగ నారంభించె ననియు వాని కన్నిటికి ల. కవి సమ మగునాంధ్రపదములు చెప్పె ననియు దానికి మిగుల సంతసించి బ్రౌనుదొర ల. కవిరాకకు కతం బేమి యని యడుగఁ దనమేనల్లుం డగు చింతలూరి. మంగన్నం జూపి అతనినిమిత్తమై వచ్చియుంటినని తెల్పెను. దానిపై బ్రౌనుదొర అతఁ డేమిపనికై వచ్చియుండె ననఁగా నతనినే నీవు వచ్చినకార్యము విన్న వింపు మని తెల్పఁగా మంగన్న యీక్రింది పద్యములం దెల్పెను. అవి యెట్లన్నను :-