పుట:Kavijeevithamulu.pdf/445

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
439
పిండిప్రోలు లక్ష్మణకవి.

పండితునివంటి వార లిప్పటికి ననేకు లున్నను ఆధునికకవులు ప్రభుత్వమువారిభయమువలన రవ్వ చేయక యున్నారు. ల. కవి ద్య్వర్థికావ్యకవియును ధీరుండు నవుటంజేసి యిట్టిపద్యంబులఁ బ్రకటించుటయకాక యొకనాఁటి సమయములో దేవళంబునకుఁ బోవుచున్న పైపండితుం జూచి అతని యెదురుగా నిలువంబడి అతనిదుర్మార్గత యతనికిం దెలుప నిశ్చయించుకొని తానును స్వామిదర్శనార్థంబు బోయినట్లుగాఁ బోయి అనంతంపంతుల కెదుట నిలువంబడి శంకరు నుద్దేశించి నుతియించినట్లుగా నీక్రిందిపద్యంబు చెప్పెను. ఎట్లన్నను :-

మ. అవురా శంకర మంచి వాఁడవు ననంతాఖ్యుండ వై తీర్పెఱుం
     గవు మంగన్నరఁజేసి నీవు బుధమార్గభ్రష్టతం జోగిరా
     గ వరాలంది పినాకినిం బశుపతీకల్లోలివిం బట్టి స
     త్యవధూసత్వము దానియం దిడితి వాశాయత్తు లిట్లేకదా.

అని జోగిరాజు వరాలు లంచమియ్యగాఁ నక్రమ మగుతీర్పు చేసి తని పండితుని ముఖముమీదఁ గొట్టినట్లు చెప్పి తనసమీపమున నుండెడువారితోఁ దాని కె ట్లీశ్వరపరముగా నర్థము చెప్పవలయునో దాని నన్వయించి యుపన్యసింపుడు, వినుచున్న పండితుఁడు తన్ను బాహాటముగఁ దిట్టుచున్నను ల. కవి పద్యమున కర్థాంతరముం జెప్పి తనపని యర్థాంతరము చేసె నని చిన్న వోయి మాటలాడక తొలఁగిపోయెను.

ల. కవి సి. పి. బ్రౌనుదొరం జూచుట.

ఇట్లుగా ల. కవి పండితుఁడు తనమేనల్లునకుఁ జేసినయపకారమునకు మిగులఁ జింతించినవాఁడై అప్పీలు చేయించియైన నతని ధనమును వసతియు నిలుప నూహించి మేనల్లుని వెంటఁ దీసుకొని బందరుపట్టణమునకుఁ బ్రయాణంబై పోయెను. అచ్చట నుండుప్రొవిన్షియల్ కోర్టులో నప్పీలు చేయించుట కేర్పర్చుకొని ల. కవి అందులో నొకజడ్జీగా నుండిన బ్రౌనుదొరను ముందుగా దర్శించి ఆతఁడు తెలుగులలోఁ బండితుఁ డవుటంజేసి యందులో నుండెడితనప్రజ్ఞ నతనికిఁ దెల్పి కార్యసాధనము చేసుకొన గమకించి యీక్రింది సీసమాలికను జదివె. ఎట్లన్నను.