పుట:Kavijeevithamulu.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

429

రాజుగారి పేరిటఁ గృతియిచ్చినాను. ఇపుడు చదువుచున్న గ్రంథభాగము కథానాయకుఁ డగుప్రభునివిషయమై యున్నది. అని యుత్తర మిచ్చెను. అటుపైని ల. కవి యిట్లనియె. సర్వకామదకుఁ బరిణయ మేమి అని ప్రశ్నించెను. దానికి కృ. కవి సర్వకామద యనునది యొకదేవత పేరు. ఆదేవతయొక్కకళ్యాణముం జెప్పుచుండుటంజేసి ఆగ్రంథమునకు సర్వకామదాపరిణయ మని పే రుంచితి ననియె.

ల. కవి సర్వకామద నీ కుపాసనాదేవత యైనఁ గానిమ్ము. అట్టిసర్వకామదకు వివాహము చేయఁగమకించినవారి నేరిం గానము. అయినను ఇక్కడ నుండువారివలననే నీసంశయము నివారించెద నని ఆసభయందు నృత్తగీతార్థమై వచ్చి నిలువంబడియున్న యొక వెలయాంలిం బిలచి మీ సంప్రదాయములు మీకే తెలియవలెఁగాని మాబోంట్లకుఁ దెలియవు. నీకుఁ బెండ్లి యయినదా లేకున్న నెప్పుడు కాఁగలదు. అని ల. కవి యడిగినతోడనేనవ్వుచు నా వెలయాలు తననుహాస్యముచేయుటకుఁగాకున్న వెలయాలిపెండ్లిసంగతి తన నేల యడిగెదరనియు బెండ్లియే యయి యుండిన మే మీ సభకు వచ్చుట యెట్లు కల్గు ననియు నుత్తరము చెప్పెను. ఆమాటకు ల. కవి సమాధానము చెప్పక కృ. కవిని జూచి వెలయాలు చెప్పుచున్నసంప్రదాయము విని దానికి సమాధానము చెప్పుట యవసర మనిరి.

కృ. కవి సర్వకామద యనుదేవతంగూర్చి నేను మాటలాడుచుండ నిచ్చట వెలయాలి ప్రసంగ మేల వచ్చెను.

ల. కవి. సర్వకామద వెలయా లగును. గనుక నే నట్లు ముచ్చటించితిని. మీ కిష్టములేనియెడల మఱియొకప్రశ్నం బాలోచించెదను. కానిండు. అన్న దమ్ములలోఁ బెద్దవాఁ డుండఁగాఁ జిన్న వానికి వివాహము చేయవచ్చునా ?

కృ. కవి. ఇక్కడ అట్టి ప్రస్తావన యే మున్నది. లేనిపోని ప్రశ్న లేల ?